ఖమ్మం మామిళ్లగూడెం: ఖమ్మం ఇందిరానగర్ (ఏక్ మినార్) మసీదులో విద్యార్థులకు నమాజ్ పద్ధతులను ఆచరణాత్మకంగా నేర్పించడమే కాక సూరాలను కంఠస్థం చేయించేందుకు నెల రోజులుగా వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరం గురువారం ముగియగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన ఎస్.కే.అర్హన్‌కు సైకిల్, ఎస్.కే.అర్ఫాన్‌కు రూ.2 వేలు, మూడు, నాలుగు బహుమతులుగా సాద్ అమీన్, ఆఖిబ్‌కు రూ.వేయి చొప్పున అందించి అభినందించారు. మసీదు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ యూసుఫ్ అలీతో పాటు యాకూబ్‌పాషా, గౌసుద్దీన్, ఇమామ్, ఖతీబ్ హాఫిజ్, మహ్మద్ అమీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరంలో పుష్కరాల విధుల్లో జిల్లా ఉద్యోగులు
ఖమ్మంగాంధీచౌక్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి నది అంత్య పుష్కరాల విధులకు ఉమ్మడి జిల్లాకు చెందిన దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు, ఉద్యోగులను కేటాయించారు. ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమీషనర్ మేకల వీరస్వామితో పాటు వివిధ ఆలయాల్లో పనిచేస్తున్న ఈఓలు, ఉద్యోగులు, సిబ్బంది, ఆఫీస్ సబార్డినేట్లు మొత్తం 10మందికి అక్కడ డ్యూటీలు వేశారు. ఈనెల 21నుంచి 26వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా ఉద్యోగులు స్నాన ఘట్టాలు, విశ్రాంతి కేంద్రాలు, అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ విధులు నిర్వర్తించనున్నారు.
వడదెబ్బతో మహిళ మృతి
ఖమ్మం అర్బన్: ఖమ్మం పదో డివిజన్ సుందరయ్యకాలనీకి చెందిన కొత్తపల్లి సీత(51) వడదెబ్బతో మృతి చెందింది. కూలీ పనులతో జీవనం సాగించే ఆమె గురువారం ఉదయం పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి పడుకుంది. అనంతరం అపస్మారక స్థితికి చేరగా కుటుంబీకులు పరిశీలించేసరికి అప్పటికే మృతి చెందింది. తీవ్ర ఎండలతో వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు భావిస్తున్నారు. సీత భర్త ఏడాది మృతి చెందగా, ఒక కుమార్తె వివాహం అయింది. ప్రస్తుతం సీత తన అత్తతో కలిసి నివాసముంటోంది.
పశువుల అక్రమ రవాణా అడ్డగింత
పెనుబల్లి: పశువులను అక్రమంగా తరలిస్తున్న డీసీఎం వ్యాన్‌ను వీఎం బంజర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై కె.వెంకటేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వీఎం బంజర పోలీస్‌స్టేషన్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా పశువుల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం వ్యాన్ పట్టుబడింది. ఏపీలోని పార్వతీపురం నుంచి హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు 15గిత్తలను తరలిస్తున్నట్లు తేలగా స్వాధీనం చేసుకున్నారు. పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న అనకాపల్లి జిల్లా సీతారాంపురానికి చెందిన వ్యాన్ డ్రైవర్ ముల్లి నూకరాజు, నొక్కి దీవన్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేష్ వివరించారు.


