కొనుగోలు కేంద్రంలో 20బస్తాల ధాన్యం దగ్ధం | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రంలో 20బస్తాల ధాన్యం దగ్ధం

May 22 2026 12:36 AM | Updated on May 22 2026 12:36 AM

ఖమ్మంరూరల్‌: మండలంలోని తీర్థాలలో రైతులు వరి కొయ్యలకు గురువారం మంట పెట్టడంతో నిప్పు రవ్వలు ఎగిసిపడి సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి వ్యాపించాయి. దీంతో కొనుగోలు కేంద్రంలోని 20 బస్తాల మేర ధాన్యం కాలిపోయింది. మంగళగూడెంకు చెందిన రైతు వీరెల్లి విక్రమ్‌ 85బస్తాల ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురాగా, 45 రోజులుగా కాంటా వేయకపోవడంతో కేంద్రంలోనే నిరీక్షిస్తున్నాడు. ఈక్రమాన గురువారం మధ్యాహ్నం చుట్టుపక్కల రైతులు పొలాల్లో కొయ్యలకు నిప్పటించడంతో అవి కేంద్రానికి వ్యాపించి ధాన్యం బస్తాలకు మంట అంటుకుంది. సమీపంలోని రైతులు స్పందించేలోగా రూ.40వేల విలువైన 20 ధాన్యం బస్తాలు కాలిపోయాయి. ఈ విషయం తెలిసిన అక్కడకు చేరుకుని ఏదులాపురం సొసైటీ ఉద్యోగులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు కాంటా వేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్‌ వినయేందర్‌రెడ్డి చేరుకుని కేంద్రంలోని ధాన్యం కాంటా వేసి గోదాంకు తరలించాలని ఆదేశించారు.

సుబాబుల్‌ తోట..

కామేపల్లి: ప్రమాదవశాత్తు సుబాబుల్‌ తోటకు నిప్పుంటుకుని కాలిపోయిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. కెప్టెన్‌బంజర గ్రామానికి చెందిన కమ్మ నాగమణికి చెందిన 12ఎకరాల్లో సుబాబుల్‌ తోట ఉండగా, సమీపంలోని ఓ రైతు పంట వ్యర్థాలకు అంటించిన నిప్పు ఎగిసిపడి తోటను అంటుకుంది. దీంతో మంటలు ఎగిసిపడి తోటంతా కాలిపోయింది. మంటలు చుట్టుపక్కల చేలకు వ్యాపించకుండా సర్పంచ్‌ ఆరెం అచ్చమ్మ జీపీ ట్యాంకర్‌ ద్వారా నీరు చల్లిస్తుండగా, అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనలో రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని రైతు నాగమణి వాపోయారు. అలాగే, పండితాపురంలో ఓ రైతు మొక్కజొన్న చెత్తకు నిప్పు పెట్టడంతో గాలికి మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న నర్సరీ షెడ్‌కు అంటుకున్నాయి. ఈ ఘటనలో పైపులతో పాటు షెడ్‌ నెట్‌ కొంత భాగం కాలిపోయింది.

45 రోజులుగా

కాంటా వేయకపోవడంతో నష్టం

Advertisement
 
Advertisement
Advertisement