ఇంటి నంబర్‌.. ‘బై’పాస్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంటి నంబర్‌.. ‘బై’పాస్‌

May 21 2026 12:26 AM | Updated on May 21 2026 12:26 AM

శివారు ప్రాంతాల్లోనే అధికంగా

ఇలా కేటాయింపు

అక్రమార్కులకు కలిసొస్తున్న

సాంకేతిక లోపాలు

ఫిర్యాదు అందితేనే కదులుతున్న

యంత్రాంగం

మూడు ఇళ్లకు ఒకే నంబర్‌

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగరపాలక సంస్థ(కేఎంసీ) పరిధిలో ఆక్రమణదారుల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక లోపాలు వారికి కలిసొస్తుండడంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ స్థలాలను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడమే కాక మున్సిపల్‌ రికార్డుల్లోనూ నమోదు చేయించుకుంటున్నారు. ఒకరిద్దరు సిబ్బందిని గుప్పిట్లో పెట్టుకుని దరఖాస్తులు డీమ్డ్‌ అప్రూవల్‌ అయ్యేలా చూసుకుంటున్నారనే విమర్శలున్నాయి. కొందరు సిబ్బంది నిర్వాకంతో ఒకే డోర్‌ నంబర్‌ మూడు, నాలుగు ఇళ్లకు మంజూరవుతుండగా.. కొన్ని సందర్భాల్లో ఒకే డోర్‌ నంబర్‌తో నాలుగైదు అసెస్‌మెంట్‌ నంబర్లు జారీ అవుతున్నాయి.

సాంకేతిక లోపాలతో సులువుగా..

ఇంటి నంబర్‌ కావాలంటే సంబంధిత ధ్రువపత్రాలతో సీడీఎంఏ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ఆ పత్రాలను కేఎంసీ కార్యాలయంలో సమర్పించాలి. అయితే ఇటీవల ఆస్తుల కొనుగోలు తర్వాత రిజిస్ట్రేషన్‌ సమయాన ఐజీఆర్‌ఎస్‌ నుంచి నేరుగా ఇంటి నంబర్లు మంజూరవుతున్నాయి. దీంతో కొందరు ఆక్రమించుకున్న స్థలంలో ఇళ్లు ఉన్నట్లు, ఆ స్థలానికి తమ పేరుతో డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. ఈ విధానంతో నేరుగా ఇంటి నంబర్‌ వస్తుండడం అక్రమార్కులకు కలిసొస్తోంది. దీనిని పరిశీలించి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇక సీడీఎంఏలో ఉన్న సాంకేతిక లోపాలను మరికొందరు ఆసరాగా చేసుకుని బై నంబర్లతో దరఖాస్తులకు డీమ్డ్‌ అప్రూవల్‌ పొందుతున్నారు. ఈ కారణంగా అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలు, కబ్జా స్థలాల్లోని నిర్మాణాలకు నంబర్లు జారీ అవుతున్నాయి.

ఏ స్థలమైనా కబ్జా

ఖమ్మం నగర నడిబొడ్డున ఖాళీ స్థలాలు దొరకకపోవడంతో అక్రమార్కుల కన్ను శివారు ప్రాంతాలపై పడింది. విలీన గ్రామాలు, నగర శివారు డివిజన్లలో ఈ ‘బై నంబర్ల’ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు నిర్మాణం చేపట్టడమో లేదా తప్పుడు డాక్యుమెంట్లతో నంబర్లు పొందడమో చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్థలాలనే తేడా లేకుండా లొసుగులు, సరిహద్దు వివాదాలు ఉన్నవి కాజేసేందుకు ఇంటి నంబర్లను ఆయుధంగా మార్చుకుంటున్నారు.

నిఘా కరువై..

ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. స్థలాల పరిరక్షణలో మున్సిపల్‌, రెవెన్యూ శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఒకే నంబర్‌ ఇద్దరు, ముగ్గురి పేరిట కేటాయింపు జరుగుతున్నా సాఫ్ట్‌వేర్‌ ఎందుకు అలర్ట్‌ చేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితులు కార్యాలయాల చుట్టూ తిరిగి లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే తప్ప అధికారుల్లో కదలిక రావడం లేదు. ఎవరూ ఫిర్యాదు చేయకపోతే ‘బై’పాస్‌ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతూనే ఉంది. ఇప్పటికై నా కేఎంసీ ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా పెట్టి, డోర్‌ నంబర్ల కేటాయింపునకు క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి చేయాలని నగరవాసులు కోరుతున్నారు.

కేఎంసీలో పలు ఇళ్లకు

ఒకే డోర్‌ నంబర్‌

వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలో వేర్వేరు యాజమానులకు చెందిన మూడు ఇళ్లకు 17–4–35/1/ఏ/1 డోర్‌ నంబర్‌ కేటాయించారు. ఈ ఇంటి నంబర్‌లోని యజమానుల్లో ఒకరి పేరిట ఇల్లు రెసిడెన్షియల్‌, మరో ఇద్దరి పేరిట నంబర్లు నాన్‌ రెసిడెన్షియల్‌ కేటగిరీలో ఉన్నాయి. రఘునాథపాలెం బైపాస్‌ రోడ్డులోని ఎన్నెస్పీ ప్రధాన కాలువ పక్కన నిర్మించిన ఇంటికి సైతం ఇదే నంబర్‌ ఉండడం గమనార్హం. ఈ ఇంటి నంబర్‌ వెలుగుమట్లగా రెవెన్యూగా చూపిస్తున్నా ఏ ప్రాంతమనేది సీడీఎంఏ సైట్‌లో లేదు. ఇలాంటి సాంకేతిక లోపాలు అక్రమార్కులకు కలిసొస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement