వీధి శునకాల సమస్యపై
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఖమ్మంలో ఏబీసీ ఉన్నా
కానరాని ప్రయోజనం
ఏ వీధిలో చూసినా కుక్కల గుంపులు
మిగతా ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా కేంద్రంతో పాటు ఇతర పట్టణాలు, గ్రామాల్లో వీధి కుక్కల స్వైరవిహారం రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రీపగలు తేడా లేకుండా రోడ్లపై నడవాలంటేనే జనం వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. గుంపులుగా తిరిగే కుక్కలు పిల్లలు, వృద్ధులపై దాడి చేస్తుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యాన వీధి కుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు జిల్లాలో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రమాదకరమైన, పిచ్చి కుక్కలకు కారుణ్య మరణం ప్రసాదించాలనే సూచనతో కుక్కల నియంత్రణ జరుగుతుందనే చర్చ ప్రారంభమైంది.
కేఎంసీలో నామమాత్రమే
ఖమ్మం నగరంలో 10వేలకు పైగా కుక్కలు ఉన్నట్లు తెలుస్తుండగా.. జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష వీధి కుక్కలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఖమ్మంలో కుక్కల సంతాన నియంత్రణ కోసం యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) కేంద్రం ఏర్పాటుచేయగా, సంతతిని అరికట్టే శస్త్రచికిత్సలు నిరంతరం కాకుండా నామమాత్రంగా సాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వీధి కుక్కలను పట్టుకుని శస్త్రచికిత్స చేసి వదిలేయకుండా వాటి సంరక్షణ కోసం ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ నగరంలో ఆశ్రయాలు(షెల్టర్లు) లేక కుక్కల సంచారం తగ్గడం లేదు.
సరిహద్దు చిక్కులు
ఖమ్మం నగరాన్ని ఆనుకుని ఉన్న ఏదులాపురం మున్సిపాలిటీలో సమస్య మరింత జఠిలంగా మారింది. ఏదులాపురం మున్సిపాలిటీలో కుక్కలకు శస్త్రచికిత్స చేయడానికి సెంటర్ లేదు. అక్కడి కుక్కలను ఖమ్మం తరలించాలంటే సరిహద్దు సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ ఇదే తరహా సమస్య నెలకొంది. ఫలితంగా పక్క మున్సిపాలిటీలు, గ్రామాల్లో కుక్కల సంతతి పెరుగుతూ ఖమ్మంలోకి ప్రవేశిస్తున్నాయి.
ఆదేశాలైనా అమలయ్యేనా..
సుప్రీంకోర్టు తాజాగా ప్రభుత్వం, స్థానిక సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజల భద్రతకు ముప్పుగా మారిన ప్రమాదకరమైన, పిచ్చి కుక్కలకు కారుణ్య మరణం ప్రసాదించేలా అనుమతిచ్చింది. వీధి కుక్కల నియంత్రణకు ప్రతీ జిల్లాలో కనీసం ఒక ఏబీసీ ఏర్పాటు చేయాలని, ఆస్పత్రుల్లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు తగినంతగా సమకూర్చాలని ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేస్తే కుక్కలను నియంత్రించవచ్చనే చర్చ జరుగుతోంది. అయితే, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి వదిలేయకుండా ప్రతీ మున్సిపాలిటీలో వీధి కుక్కల కోసం షెల్టర్లు ఏర్పాటు చేస్తేనే బెడద తగ్గుతుంది.
●నేలకొండపల్లి మండలంలోని ముజ్జిగూడెంలో ఫిబ్రవరి 28న ఒకేరోజు ఎనిమిది మందిపై కుక్క దాడి చేసింది. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వీరిందరికీ గాయాలు కావడంతో ఆస్పత్రి పాలయ్యారు.
●కల్లూరు ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పరిధిలో నెలకు సుమారు 40 – 50 కుక్క కాటు బాధితులు వస్తున్నారు. ఇక మండలంలోని ఇతర గ్రామాల్లో నెలకు కనీనం 35మంది కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వపరంగా వీధి కుక్కలకు వేసక్టమీ ఆపరేషన్లు కానీ యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు కానీ చేయడం లేదు.
●పెనుబల్లి మండలంలో రోజూ 8మంది కుక్క కాటుకు గురవుతున్నట్లు అంచనా. పెనుబల్లి ఆస్పత్రిలో సగటున ఆరుగురు, లంకాసాగర్ పీహెచ్‌సీలో ఇద్దరు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
●ఖమ్మం యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రంలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు 1,064 కుక్కలకు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం రోజుకు పది కుక్కలకు శస్త్రచికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది.


