సభ్యత్వ ఇన్‌చార్జ్‌లకు తగిన ప్రాధాన్యత
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మంవైరారోడ్: లక్షలాదిగా ఉన్న కార్యకర్తలే బీఆర్‌ఎస్‌కు బలమని, కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అధ్యక్షతన ఖమ్మం, మధిర, వైరా, ఇల్లెందు నియోజకవర్గాలకు సంబంధించి సభ్యత్వ నమోదు మండల ఇన్‌చార్జిల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు చిరస్థాయిగా గుర్తుండిపోతాయన్నారు. అలాగే, రెండు దశాబ్దాలుగా ఉద్యమకారులు, కార్యకర్తలు, నాయకులు పార్టీకి అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో మండల ఇన్‌చార్జిలు పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఇన్‌చార్జిలకు భవిష్యత్‌లో పార్టీ ప్రాధాన్యత కల్పిస్తుందని, పదవులు లేకపోయినా సేవలందిస్తున్న కార్యకర్తలు, నాయకులకు అన్ని వేళలా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు పగడాల నాగరాజు, గుండాల కృష్ణ, దిండిగల రాజేందర్, ఖమర్, మంజుల, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.


