● మ్యాన్‌హోల్స్ మూసివేత, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు ● సన్నద్ధతపై సమీక్షలో కలెక్టర్ దివాకర
ఖమ్మంసహకారనగర్: సరైన ప్రణాళిక, ముందస్తు జాగ్రత్తలతో వరదల వంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన ఖమ్మం, ఏదులాపురం మున్సిపాలిటీలు, పలు శాఖల అధికారులతో విపత్తుల సన్నద్ధతపై సమీక్షించారు. గత అనుభవాలను పరిశీలిస్తే ఖమ్మం, ఏదులాపురం ప్రాంతాలపై వరదల ప్రభావం అధికంగా పడుతున్నందున మున్నేటి ప్రవాహం స్థాయి ఆధారంగా హెచ్చరికలు జారీ చేయడం, లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన సామగ్రిని ముందుగా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అంతేకాక మున్సిపల్ ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లను పూర్తిస్థాయిలో పరిశీలించి మూసివేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఖమ్మం, ఏదులాపురం కమిషనర్లు అభిషేక్ అగస్త్య, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా పింఛన్ లబ్ధిదారుల పరిశీలన
చేయూత పెన్షనర్ల గుర్తింపునకు చేపడుతున్న లైవ్ అథెంటికేషన్‌లో పారదర్శకత పాటించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ ఉపాధి హామీ పనులు, చేయూత పింఛన్ సర్వే, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అమలుపై వీసీ ద్వారా సూచనలు చేశారు. ఈ వీసీకి జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ హాజరయ్యారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతీ గ్రామపంచాయతీలో కనీసం 20 పనులను గుర్తించాలని, ఇందులో అంగన్‌వాడీ భవనాలు, పాఠశాలల ప్రహరీలు, వీఓ, జీపీ భవనాలకు ప్రాధాన్యత ఇస్తూ కూలీలు ఎక్కువగా హాజరయ్యేలా అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, దివ్యాంగుల సదరం కేంద్రాల్లో అవసరమైన పరికరాల ఏర్పాటు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అమలుపై సూచనలు చేశారు. సమావేశంలో డీఆర్‌డీఓ శ్రీరామ్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు.


