25 వరకు రెండో విడత ‘దోస్త్‌’ అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

25 వరకు రెండో విడత ‘దోస్త్‌’ అడ్మిషన్లు

May 21 2026 12:26 AM | Updated on May 21 2026 12:26 AM

ఖమ్మంసహకారనగర్‌: ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్‌)లో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మహ్మద్‌ జాకిరుల్లా తెలిపారు. ‘దోస్త్‌’సైట్‌ ద్వారా ఈ నెల 25వ తేదీ వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే, 26వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, మొదటి దశలో నమోదు చేసుకున్న వారు ఈ నెల 23 వరకు రిపోర్ట్‌ చేయాలని సూచించారు.

జాతీయస్థాయి షూటింగ్‌బాల్‌ పోటీలకు ఎంపిక

మధిర: రాష్ట్రస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొన్న మధిరలోని శ్రీనిధి స్కూల్‌ విద్యార్థులు వేమిరెడ్డి కార్తీక్‌రెడ్డి, టి.అభిషేక్‌ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 29, 30, 31వ తేదీల్లో గుంటూరులో జరిగే జాతీయస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున వీరు ప్రాతినిధ్యం వహించనున్నారు. విద్యార్థులను పాఠశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌ బి.అంజన్‌బాబు, డైరెక్టర్‌ సీహెచ్‌ చందు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డి.శ్రీనివాసరావు, పీడీ ప్రవీణ్‌కుమార్‌ అభినందించారు.

మార్కెట్‌ ఉద్యోగుల్లో

ఇద్దరికి పదోన్నతి

ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ మార్కెట్లలో గ్రేడ్‌–3 కార్యదర్శులు ఇద్దరికి బుధవారం గ్రేడ్‌–2 కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 14 మంది గ్రేడ్‌–3 కార్యదర్శులకు పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌ ఇవ్వగా జాబితాలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు ఉన్నారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట గ్రేడ్‌–3 కార్యదర్శి తాడేపల్లి కిరణ్‌కుమార్‌కు పదోన్నతి కల్పించి ఖమ్మం మార్కెట్‌లో, బూర్గంపాడు మార్కెట్‌ కార్యదర్శి డి.నిర్మలకు గ్రేడ్‌–2 కార్యదర్శిగా పదోన్నతి కల్పించి ఏన్కూరు మార్కెట్‌లో పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

‘ఏకలవ్య’లో సీటు దొరకడం అదృష్టం

పాల్వంచరూరల్‌: గిరిజన విద్యార్థులకు మెరుగైన బోధన అందిస్తున్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో సీటు లభించడాన్ని అదృష్టంగా భావించాలని గిరిజన గురుకులాల ఆర్‌సీఓ అరుణకుమారి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఏకలవ్య గురుకులాల్లో ప్రవేశాల కోసం గిరిజన బాలబాలికలకు పాల్వంచలోని రామవరం కాలేజీలో బుధవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఆర్‌సీఓ మాట్లాడుతూ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ ఈసీలో 299 సీట్లకు గాను 123 మంది బాలురు, 146మంది బాలికలకు ప్రవేశాలు కల్పించామని తెలిపారు. ప్రిన్సిపాళ్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement