తిరుమలాయపాలెం: సుదూర ప్రయాణం, రాత్రయినా ఎండ వేడి తగ్గకపోవడంతో కోళ్లదాణా తరలిస్తున్న ఓ లారీకి మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి విజయవాడకు కోళ్ల దాణా తరలిస్తున్న లారీ మాదిరిపురం వద్దకు రాగానే బ్యాటరీలో మంటలు మొదలయ్యా యి. ఆపై డీజిల్ ట్యాంకుకు అంటుకుని లారీ అంతా వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన లారీ డ్రైవర్, క్లీనర్ బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆపై వాహనదారులు మరిపెడ అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రెండు వాహనాలతో చేరుకుని ఉద్యోగులు మంటలను అదుపుచేశారు. అయితే, రోడ్డుపై లారీ ఆగిపోవడం, మంటలు ఎగిసిపడుతుండడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఎస్‌ఐ కె.జగదీశ్, సిబ్బందితో చేరుకుని, సహాయక చర్యలు చేపట్టి, జేసీబీతో లారీని పక్కకు తప్పించి రాకపోకలను పునరుద్ధరించారు.
వరుస అగ్నిప్రమాదాలు
ఎండల తీవ్రతకు తోడు త్వరగా గమ్యం చేరాలనే డ్రైవర్ల భావనతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇటీవల మండలంలోని మేకలతండా వద్ద బొగ్గు లారీ, ఆలుగడ్డ లారీలు ఢీకొని మంటలు వ్యాపించగా ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మరువకముందే మంగళవారం అర్ధరాత్రి కోళ్లదాణా తరలిస్తున్న లారీ కూడా అగ్ని పమాదంలో కాలిపోయింది. వేసవి నేపథ్యాన ఇంజన్ వేడి ఎక్కి ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
డ్రైవర్, క్లీనర్ దూకడంతో తప్పిన ప్రాణనష్టం


