ఖమ్మంవైద్యవిభాగం: ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ (ఏఐఓసీడీ) పిలుపు మేరకు జిల్లాలో బుధవారం మెడికల్ షాపుల బంద్ పాటించారు. ఫార్మసిస్టులు, డిస్ట్రిబ్యూటర్లు సైతం మద్దతు తెలపడంతో జిల్లావ్యాప్తంగా మందుల దుకాణాలు మూతపడ్డాయి. కాగా, మెడికల్ షాపులు మూతబడడంతో సాధారణ రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ఆస్పత్రుల వద్ద అత్యవసర మందుల అమ్మకానికి షాపులు తెరిచి ఉంచటంతో చికిత్స పొందుతున్న వారికి మాత్రం సమస్య తలెత్తలేదు. కాగా, పలు ప్రాంతాల్లో ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ నాయకులు ర్యాలీలు నిర్వహించి నిరసన తెలిపారు. ఆన్‌లైన్ అమ్మకాలతో ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని, ప్రిస్కిప్షన్ లేకుండా మత్తు మందులు కూడా విక్రయిస్తుండడంతో పలువురు ప్రాణాపాయం ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ విక్రయాలకు అనుమతి ఇవ్వడం సరైనదే అయినా, ప్రస్తుతం మాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఇకనైనా ప్రజారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఆన్‌లైన్ విక్రయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


