సత్తుపల్లిటౌన్: రాఘవపురం అనే గ్రామంలో అన్నదమ్ములు రవి, బంటి ఉండేవారు. ఓరోజు వాళ్ల నాన్న ఇద్దరినీ జాతరకు తీసుకొని వెళ్లాడు. అక్కడ ఒక దుకాణంలో బొమ్మ బంటికి ఎంతో నచ్చింది. దానిని కొని పెట్టమని వాళ్ల నాన్నని అడిగితే కొనిచ్చాడు. రవి వైపు తిరిగి ‘నీకేం కావాలి’అని అడిగితే ‘నాకు ఏమీ వద్దు. కానీ ఆ డబ్బులు నాకు ఇవ్వు.. ముంతలో దాచుకుంటాను’అన్నాడు రవి. దీంతో వాళ్లనాన్న కొంత డబ్బు ఇచ్చాడు. ఆ నగదును జాగ్రత్తగా ముంతలో దాచుకున్నాడు రవి. ఎప్పుడు, ఎవరు డబ్బు ఇచ్చినా వృథా ఖర్చు పెట్టకుండా.. జాగ్రత్తగా దాచుకోవడం మొదలుపెట్టాడు. అలా కొంత డబ్బు జమ అయింది. ఓరోజు బంటి ఆడుకుంటున్నప్పుడు కాలికి ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. కానీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కొద్దిరోజుల తర్వాత అక్కడ బాగా నొప్పి చేసింది. వాళ్ల నాన్న అడిగితే కాలికి ఏదో గుచ్చుకుందని చెప్పాడు. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లితే డాక్టర్ పరీక్ష చేసి కాలికి ఆపరేషన్ చేయాలని చెప్పాడు. ఆ వెంటనే వాళ్ల నాన్న బ్యాంకుకు వెళ్లి దాచిన డబ్బు తీసుకువచ్చాడు. కానీ ఆపరేషన్‌కు ఆ నగదు సరిపోలేదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా రవి తాను దాచుకున్న డబ్బు తీసుకువచ్చి తండ్రికి ఇచ్చాడు. వాళ్ల నాన్న ఎంతో సంతోషించి ముద్దాడాడు. ఆ డబ్బు తీసుకువెళ్లి ఆస్పత్రిలో చెల్లించగానే బంటికి ఆపరేషన్ చేయగా, కొద్దిరోజుల్లోనే నయమైంది. జరిగిన విషయమంతా తెలుసుకున్న బంటి అప్పటి నుంచి తాను కూడా డబ్బు పొదుపు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు.
నీతి: పొదుపు చేయడాన్ని చిన్నతనం నుంచే అలవరుచుకోవాలి. చిన్నమొత్తాలతో పొదుపు చేయడం మొదలైతే అవే భవిష్యత్‌లో పెద్దమొత్తంగా మారతాయి. భవిష్యత్ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఎం.అభినయ్,
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సత్తుపల్లి


