విద్యుత్‌ అంతరాయాలకు బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ అంతరాయాలకు బ్రేక్‌

May 20 2026 2:10 AM | Updated on May 20 2026 2:10 AM

● ఏబీ స్విచ్‌ల ద్వారా త్వరగా లోపాలు గుర్తింపు ● జిల్లావ్యాప్తంగా ఏర్పాటుకు మొదలైన పనులు సాంకేతికతతో బలోపేతం

● ఏబీ స్విచ్‌ల ద్వారా త్వరగా లోపాలు గుర్తింపు ● జిల్లావ్యాప్తంగా ఏర్పాటుకు మొదలైన పనులు

ఖమ్మంవ్యవసాయం: విద్యుత్‌ అంతరాయాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏబీ(ఎయిర్‌ బ్రేక్‌) స్విచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్‌ అంతరాయం ఏర్పడినప్పుడు లైన్‌ మొత్తం విద్యుత్‌ సరఫరా నిలిపివేయకుండా కేవలం సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద నిలిపేసి, మిగిలిన ప్రాంతానికి సరఫరా కొనసాగించేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈ విధానంతో విద్యుత్‌ అంతరాయాలను గణనీయంగా తగ్గించవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే ఖమ్మం విద్యుత్‌ సర్కిల్‌ పరిధిలో 821 ఏబీ స్విచ్‌లను ఏర్పాటు చేయగా, మిగతా ప్రాంతాల్లోనూ పనులు కొనసాగుతున్నాయి.

ఇదీ ఉపయోగం

విద్యుత్‌ లైన్లలో సాంకేతిక లోపాలు, చెట్ల కొమ్మలు తగలడం, భారీ వర్షాలు, ఈదురు గాలులు వంటి కారణాలతో ఏర్పడే అంతరాయాలను ఏబీ స్విచ్‌ల ద్వారా తక్షణమే గుర్తించవచ్చు. గతంలో చిన్న అంతరాయం ఏర్పడినా మొత్తం గ్రామం లేదా ఫీడర్‌ పరిధిలోని కాలనీలన్నింటికీ విద్యుత్‌ సరఫరా నిలిచిపోయేది. ప్రస్తుతం ఏబీ స్విచ్‌ల వల్ల సమస్య ఉన్న ప్రాంతంలో మాత్రమే సరఫరా నిలిపివేసి, మిగతా ప్రాంతాలకు విద్యుత్‌ అంతరాయం లేకుండా సరఫరా కొనసాగిస్తారు. సమస్య ఎక్కడ ఏర్పడిందో సులభంగా గుర్తించి మరమ్మతు పనులు వేగంగా చేపట్టే అవకాశం ఏర్పడుతుంది. తరచూ ఎదురయ్యే ట్రిప్పింగ్‌ సమస్యలు గణనీయంగా తగ్గి విద్యుత్‌ నాణ్యత మెరుగుపడుతోంది. మరమ్మతు పనుల సమయంలో విద్యుత్‌ నియంత్రణ సులభమై సిబ్బంది భద్రత మరింత పెరుగుతుందని చెబుతున్నారు.

విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ సరఫరా అందించాలనే లక్ష్యంతో టీజీఎన్పీడీసీఎల్‌ అధునాతన విధానాలకు ప్రాధాన్యం ఇస్తోంది. మెరుగైన సేవలు అందించడం కోసం ఆధునిక సాంకేతికతతో విద్యుత్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాం.

–ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్‌ఈ, ఖమ్మం

Advertisement
 
Advertisement
Advertisement