కారేపల్లి: సింగరేణి మండలంలోని ఉసిరికాయలపల్లి గ్రామ రైతులకు ఊరటనిచ్చేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ భూములపై హక్కులు కలిగిన రైతులను చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా బలవంతంగా తొలగించరాదని కోర్టు స్పష్టం చేసింది. రైతుల పేర్లతో పట్టాదార్ పాసు పుస్తకాలు, రికార్డ్ ఆఫ్ రైట్స్ పత్రాలు ఉన్నప్పటికీ సరైన భూసేకరణ ప్రక్రియ లేకుండానే స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని టేకులగూడెం సర్పంచ్ గుమ్మడి సందీప్ చొరవతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇరుపక్షాల వాదన విన్న హైకోర్టు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ అవసరమని చెబుతూ ప్రతివాదులను కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది. అంతవరకు చట్టప్రకారం తప్ప రైతులను వారి భూముల నుంచి బలవంతంగా తొలగించరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఆన్‌లైన్‌లో అవగాహన
ఖమ్మంరాపర్తినగర్: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా యువజన క్రీడావారోత్సవాలు నిర్వహిస్తుండగా యువత కోసం ప్రత్యేక ఆన్‌లైన్ సదస్సు ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం సదస్సు నిర్వహించగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై నిపుణులు ఆన్‌లైన్ ద్వారా అవగాహన కల్పించారు. నైపుణ్య శిక్షణ కోర్సులు, కీడా విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు, అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వివరించారు. డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి మాట్లాడుతూ.. యువజన క్రీడోత్సవాల్లో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. కాగా, బుధవారం ఉదయం 9 గంటలకు డీపీఆర్‌సీ భవన్‌లో యువత నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య అవగాహనపై జరిగే సదస్సుకు యువత అధిక సంఖ్యలో హాజరుకావాలని సూచించారు.
బాలికల సంరక్షణ
అందరి బాధ్యత
ఖమ్మంమయూరిసెంటర్: యవ్వనదశలో ఉన్న ఆడపిల్లలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డి.రామారావు పేర్కొన్నారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మంగళవారం ఖమ్మం వెంకటేశ్వరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో మెప్మా పరిధిలోని స్వయం సహాయక సంఘాల సభ్యులతో పాటు బాలికలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. బాల్యదశ నుంచి కౌమార దశకు మధ్యలో ఉండే ఆడపిల్లల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమతుల్య ఆహారం తీసుకోకుంటే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తూనే వారి కదలికలను గమనించాలని చెప్పారు. అలాగే, కేన్సర్ కట్టడికి 15 ఏళ్ల లోపు పిల్లలకు ప్రభుత్వం ఇస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. మెప్మా, వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు జి.సుజాత, దేవిశ్రీ, జి.ఉపేంద్ర, జడ్‌ఎస్ జయపాల్, ముదసర్, హసీనా, షమీమ్, కావ్య, రహీంబీ, సంధ్య, శారద తదితరులు పాల్గొన్నారు.


