ఖమ్మం వెల్‌నెస్ కేంద్రంలో నామమాత్రంగా వైద్యం
అరకొరగా మందులు, వేధిస్తున సిబ్బంది కొరత
ఇక్కట్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక రోగులు
ఖమ్మంవైద్యవిభాగం: ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులు, పాత్రికేయులు, పెన్షనర్ల కోసం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఎనిమిది ఏళ్ల క్రితం వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేక ఆరోగ్య పథకం ద్వారా వైద్య సేవలు అందించాల్సి ఉంది. ఏళ్లు గడిచినా మెరుగైన సేవలు మాత్రం అందుబాటులోకి రావట్లేదు. ఎంతో వ్యయ ప్రయాసలతో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చే వారికి తాత్కాలిక సేవలు కూడా అందక నిరాశ చెందుతున్నారు. తరచూ మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎప్పుడు ఏ మందులు అందుబాటులో ఉంటాయో తెలియని పరిస్థతి నెలకొంది. వెల్‌నెస్ సెంటర్‌కు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి మందులు సరఫరా చేస్తున్నా, ఇండెంట్ పెట్టాక చాలా కాలానికి అందజేస్తున్నారు.
రోజుకు 200 మందికి పైగానే..
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వెల్‌నెస్ సెంటర్‌కు వైద్యసేవల కోసం ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు వస్తుంటారు. ఇక్కడ రోజూ 200 – 250 మంది వరకు వైద్య సేవలు పొందుతుంటారు. ఎక్కువ మంది దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, బీపీతో పాటు నరాల బలహీనత, జ్వరం, ఇతర సీజనల్ వ్యాధులతో బాధపడేవారు ఉంటారు. కాళ్లు, కీళ్ల నొప్పులు, వృద్ధాప్య సమస్యలతో బాధపడే రిటైర్డ్ ఉద్యోగులు అధికంగా వస్తుంటారు. సెంటర్‌లో జనరల్ మెడిసిన్, ఫిజియోథెరపీ, డెంటల్ తదితర సేవలు మాత్రమే అందుతున్నాయి. అన్ని రకాల మందులు కూడా అందుబాటులో లేవు. కనీసం బీపీ చూసే టెక్నీషియన్ కూడా లేడు. దీంతో సెంటర్‌కు వచ్చేవారు గగ్గోలు పెడుతున్నారు. జలుబు, దగ్గు మాత్రలు సైతం ఇక్కడ దొరకట్లేదు. దూరప్రాంతాల నుంచి వచ్చే ఒకేసారి నెలకు సరిపోను మందులు తీసుకుంటారు. కానీ అవి అందుబాటులో లేకపోతే ప్రైవేట్‌లో కొనుగోలు చేస్తూ రూ.వేలల్లో నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు.
ల్యాబ్ పరీక్షలకు ఇక్కట్లే
వెల్‌నెస్ సెంటర్‌లో సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఓపీ, ఇతర విభాగాల్లో కూర్చోటానికి కూడా కుర్చీలు లేవు. సెంటర్‌కు వచ్చే వారికి రక్త పరీక్షలు నిర్వహించే ల్యాబ్ టెక్నీషియన్ ఒకరే ఉండటంతో ఆయన సెలవులో వెళ్తే పరీక్షలు నిలిచిపోతున్నాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు నిరాశకు గురవుతున్నారు. ముగ్గురు ఫార్మాసిస్టులకు ఇద్దరు, నలుగుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇద్దరు, నలుగురు స్టాఫ్‌నర్సులకు ఇద్దరు, ముగ్గురు మెడికల్ ఆఫీసర్లకు ఇద్దరే విధులు నిర్వర్తిస్తుండడంతో సక్రమంగా వైద్య సేవలు అందడంలేదు.


