అప్రమత్తంగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా వ్యవహరించాలి

May 19 2026 12:52 AM | Updated on May 19 2026 12:52 AM

కలెక్టర్‌ దివాకర టీఎస్‌

ఫ్లడ్‌ మాక్‌ ఎక్సర్‌సైజ్‌ విజయవంతం

ఖమ్మం సహకారనగర్‌: వరద తదితర విపత్తుల సమయంలో అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ దివాకర టీఎస్‌ సూచించారు. విపత్తుల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం మున్నేరు పరీవాహక ప్రాంతంలో వరద ప్రమాదాల మాక్‌ ఎక్సర్‌సైజ్‌ నిర్వహించారు. వర్షాకాలంలో సంభవించే అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి సమాచారం అందిన వెంటనే వివిధ శాఖలు స్పందించాల్సిన తీరు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు, రెస్క్యూ బృందాల పని, రిలీఫ్‌ క్యాంపులు, వైద్య సేవలు తదితర అంశాలపై మాక్‌ ఎక్సర్‌సైజ్‌లో ప్రదర్శనలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆపద మిత్ర వలంటీర్ల సహకారంతో ప్రజలను రామ్‌ లీలా ఫంక్షన్‌ హాల్‌లోని పునరావాస కేంద్రానికి చేర్చారు. మాక్‌ ఎక్సర్‌సైజ్‌ను పరిశీలించిన కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ, మున్సిపల్‌, వైద్య ఆరోగ్య, విద్యుత్‌, పోలీస్‌, టీఎస్టీడీ, అగ్నిమాపక, పశుసంవర్ధక శాఖ, వివిధ శాఖల అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తే ప్రాణ, ఆస్తి నష్టం నివారించవచ్చని చెప్పారు. సాధారణంగా ప్రజలు నీరు కళ్లకు కనిపించే వరకు ఇళ్లను ఖాళీ చేయరని, ఈ ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, ఇతర అధికారులు శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీనివాస్‌, బి. మరియాదాస్‌, ప్రదీప్‌ కుమార్‌, వివిధ శాఖల అధికారులు, ఆపద మిత్ర వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

పోస్టర్ల ఆవిష్కరణ

ఖమ్మం రాపర్తినగర్‌: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 23 వరకు నిర్వహిస్తున్న పర్యాటక వారోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్‌ దివాకర టీఎస్‌ ఆవిష్కరించారు. డీవైఎస్‌ఓ టి. సునీల్‌ రెడ్డి, తెలంగాణ టూరిజం అసిస్టెంట్‌ ఇంజనీర్‌ నరేష్‌, టూరిజం ఉద్యోగి చంద్రశేఖర్‌ ఆజాద్‌, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement