నేటి నుంచి 24 వరకు గరిష్ట స్థాయిలో ఎండలు
వడగాలులపై కూడా హెచ్చరికలు జారీ
అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన
ఖమ్మంవ్యవసాయం: రానున్న ఆరు రోజుల్లో ఎండ తీవ్రత మరింతగా పెరగనుంది. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలపై మరో 1 నుంచి 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 40–45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 1 నుంచి 2 డిగ్రీలు పెరిగితే హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉంది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత ప్రభావం చూపుతోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. ఎండ తీవ్రతతో పాటు, వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది.
పమ్మి, రావినూతలలో గరిష్టంగా 43.4 డిగ్రీలు
ఖమ్మం జిల్లాలోని దాదాపు అన్నిప్రాంతాల్లో సోమవారం 40–45 డిగ్రీల మధ్య అప్రమత్తత స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పమ్మి, రావినూతలలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. బాణాపురంలో 43.2, నేలకొండపల్లిలో 43.1, తిమ్మారావుపేట, గుబ్బగుర్తిలో 43, కొణిజర్ల, తల్లాడ, కలెక్టరేట్‌లలో 42.5, మధిర, ప్రకాష్‌నగర్, నాగులవంచలో 42.1, గేటుకారేపల్లిలో 41.8, పల్లెగూడెం, వైరా, ఖానాపురంలలో 41.7, మధిర(ఏఆర్‌ఎస్), కుర్నవల్లిలో 41.6, ముదిగొండ, సిరిపురంలో 41.5, ఏన్కూరు, వైరా(ఏఆర్‌ఎస్), చింతకానిలో 41.4, సత్తుపల్లి, కూసుమంచి, ఎర్రుపాలెంలో 41.1, రఘునాథపాలెంలో 40.9, పెద్దగోపతిలో 40.7, పెనుబల్లి 40.6, ఖమ్మం ఎన్‌ఎస్‌పీ 40.5, సత్తుపల్లి ఓసీ 40.3, సదాశివునిపాలెం, వేంసూరు, లింగాలలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తగిన జాగ్రత్తలు తప్పని సరి
మండుటెండల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ సమయంలో బయట తిరిగితే వాంతులు, విరోచనాలు సంభవించే అవకాశం ఉందని చెబుతు న్నారు. బయటకు వెళ్తే తలను టోపీ లేదా టవల్‌తో రక్షించుకోవాలని సూచిస్తున్నారు. ఎండ తీవ్రతకు శరీరం నీరసించకుండా తరచూ నీరు తాగటం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ద్రావణం తాగాలని సూచిస్తున్నారు.


