ఖమ్మంగాంధీచౌక్: ఉమ్మడి ఖమ్మం జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ సోమవారం నూతనంగా ప్రారంభించిన ‘ధర్మవాణి’ కార్యక్రమానికి వివిధ అంశాలపై 22 అర్జీలు వచ్చాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన ఉద్యోగులు, అర్చకులు వేతన సమస్యలపై ఫిర్యాదులను అందించారు. వేతన బకాయిలు చెల్లించాలని, గ్రాట్యూటీ, పదోన్నతులు, ఉద్యోగ నియామకాలు చేపట్టాలని విన్నవించారు. ఖమ్మం అర్బన్, ఎర్రుపాలెం, నేలకొండపల్లి, మధిర, ఏన్కూరు, కల్లూరు, పాల్వంచ తదితర ప్రాంతాల అర్చకులు, ఉద్యోగులు తమ సమస్యలను విన్నవించారు. ఖమ్మం నగరంలోని శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో తాను 2022లో రూ. 25 వేలు విరాళంగా అందించానని, ఆ వివరాలను ఆలయ శిలాఫలకంపై ముద్రించలేదని ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు. దేవాదాయ, ధర్మాదాయ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మేకల వీరస్వామి అర్జీలు స్వీకరించారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
వేతన సమస్యలపై ఉద్యోగులు,
అర్చకుల ఫిర్యాదులు


