ఖమ్మంసహకారనగర్: ప్రజలు అందిస్తున్న ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కారం చూపాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డితో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● నగరంలోని 16వ డివిజన్ అగ్రహారం – సీతారాంపురం కాలనీ వాసులు అగ్రహారం పాత గేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభించి నాలుగేళ్లు అయిందని, పనులు పూర్తిగా ఆగిపోయి రెండేళ్లు అయిందని, ఇటు అగ్రహారం, అటు ధంసలాపురం కొత్తకాలనీ ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని, పనులు పూర్తి చేయాలని ఆ ప్రాంత వాసులు ఎం.వెంకటేశ్వర్లు, టి.అప్పిరెడ్డి, ఆళ్ల అంజిరెడ్డి, సీహెచ్ కోటేశ్వరరావు విన్నవించారు.
● వేంసూర్ మండలం మర్లపాడులో సీసీ డ్రెయిన్ నిర్మించాలని గ్రామస్తులు విన్నవించారు.
● కొణిజర్ల మండలం రాజ్యతండాకు చెందిన టి.సునీత, బి.కృష్ణ, సత్యనాగేంద్ర ముగ్గురికి కలిపి గుండ్రాతిమడుగు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 46/ఊ/2/1/2లో కొంత భూమి ఉందని, వీటి మార్కెట్ విలువ అధికంగా ఉందని దీనిని తగ్గించాలని విన్నవించారు.
● టీహబ్ డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఔట్‌సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నప్పుడు టెర్మినేషన్ పద్ధతిలో విధుల నుంచి తొలగించారని, తిరిగి తనకు ఉద్యోగం ఇప్పించాలని ఖమ్మం నగరానికి చెందిన మహ్మద్ అబ్దుల్ కరీమ్ కోరారు.


