ఖమ్మంలీగల్: ఖమ్మం కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న భూక్య రమేశ్.. సన్‌రైజ్ యూనివర్సిటీ, అల్వార్ (రాజస్థాన్) నుంచి న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. ‘క్రిమినల్ ట్రయల్స్‌లో సాక్షులు, నిపుణులపై న్యాయ అధ్యయనం’అనే అంశంపై ఆయన పరిశోధన పూర్తి చేసి 2026 మే 14న నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులవడంతో యూనివర్సిటీ డాక్టరేట్ అందించింది.
ఉత్సాహంగా
5కే రన్ షురూ
ఖమ్మంస్పోర్ట్స్: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం నుంచి ప్రారంభమైన 5కే రన్ లకారం ట్యాంక్‌బండ్ వరకు నిర్వహించారు. 500 మందికి పైగా క్రీడాకారులు, యువకులు, పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ప్రతిభ చూపితే జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అకాడమీ కోచ్ ఎండీ గౌస్, డీఎస్‌ఏ మేనేజర్ ఉదయ్‌కుమార్, క్రీడా సంఘాల ప్రతినిధులు గోవిందరెడ్డి, వీవీఎస్ మూర్తి, మతిన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, స్టేడియంలో చిన్నారులు ప్రదర్శించిన ఎరోబిక్స్, పిరమిడ్స్, యోగా ఆకట్టుకున్నాయి. ఈనెల 23వ తేదీ వరకు ప్రకటించిన ఆంశాలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు.
ఆర్డర్ రాలేదు..
డబ్బులు పోయాయి..
పెనుబల్లి: చెవుడు తగ్గేందుకు మాత్రల కోసం ఆర్డర్ చేస్తే ఆ మాత్రలు రాకపోగా సైబర్ నేరగాళ్లు రూ.76 వేలు స్వాహా చేసిన ఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ముత్తగూడెంనకు చెందిన ఓ వ్యాపారి గత ఏడాది నవంబర్‌లో ఫేస్‌బుక్‌లో వచ్చిన ప్రకటన ఆధారంగా చెవుడు తగ్గేందుకు క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో మాత్రలు ఆర్డర్ చేయగా అందలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తప్పుడు అడ్రస్ ఇవ్వడంతో కేసు నమోదైందని, కేసు కొట్టివేయడానికి డబ్బులు కావాలని అడగ్గా.. గత ఫిబ్రవరి 25వ తేదీన రూ.5 వేలతోపాటు విడతల వారీగా రూ.76 వేలు పంపాడు. వేధింపులు ఆగకపోవడం, కేసు నమోదు అబద్ధమని తేలడంతో సదరు వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు వీఎం బంజర పోలీసులు వెల్లడించారు.


