ఆ భవనం మాది..? | - | Sakshi
Sakshi News home page

ఆ భవనం మాది..?

May 19 2026 12:52 AM | Updated on May 19 2026 12:52 AM

● జీపీ కార్యాలయ భవనం ఆక్రమణ ● గ్రీవెన్స్‌లో కమిషనర్‌కు ఫిర్యాదు..

ఖమ్మంఅర్బన్‌: 14వ డివిజన్‌ గొల్లగూడెంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయ భవన (పాత గ్రామ పంచాయతీ భవనం) సముదాయ స్థలాన్ని కొందరు రిజిస్ట్రేషన్‌ చేయించుకుని, ప్రభుత్వ భవనానికి మున్సిపాలిటీలో ఇంటి నంబర్‌ పొందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. కార్పొరేషన్‌ కాక ముందు గొల్లగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం కొనసాగిన భవనంలో ప్రస్తుతం హెల్త్‌ సెంటర్‌ ఉంది. ఇటీవల కొందరు ఆ స్థలం తమదేనని పేర్కొంటూ రిజిస్ట్రేషన్‌ పత్రాలు సృష్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఇంటి నంబర్‌ కూడా పొందినట్లు సమాచారం. అప్పట్లో భవన సముదాయం ప్రాంతంలో వెంచర్‌ వేశారని, నిర్వాహకులు గ్రీన్‌ బెల్ట్‌గా చూపించడంతో 2012లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి నాటి ఎమ్మెల్యే, ఇప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. తర్వాత భవనం నిర్మించారు. కాగా, ప్రస్తుతం భవనానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్‌ అసెస్‌మెంట్‌ నోటీస్‌ బయటకు రావడంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భవన సముదాయ స్థలానికి ఎలా రిజిస్ట్రేషన్‌ జరిగిందని, మున్సిపల్‌ అధికారులు ఎలాంటి పరిశీలన లేకుండానే ఇంటి నంబర్‌ మంజూరు చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో మాజీ కార్పొరేటర్‌ కూరాకుల వలరాజు ఆధ్వర్యంలో కొందరు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సుమారు 280 గజాలకు పైగా ఉండే ఈస్థలం దాదాపు రూ.60 లక్షలకు పైగానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. భూమి యజమాని ద్వారా ఒకరు రూ.20 లక్షలకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకొని ఇంటి నంబర్‌ పొందినట్లు చెబుతున్నారు. ఇటీవల ఆ భవనం వద్దకు కొందరు వచ్చి గోడపై ఉన్న శంకుస్థాపన, ప్రారంభం నాటి శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ వ్యక్తిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ విషయంపై కార్పొరేషన్‌ ఆర్‌ఐ సుధాకర్‌ను వివరణ కోరగా గ్రీవెన్స్‌లో ఫిర్యాదు అందిందని, వార్డు ఆఫీసర్‌, ఆర్‌ఐని విచారణ చేసి పత్రాలను సేకరించాలని అదేశించామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement