కేజీబీవీల్లో చింతకాని టాప్
● గతం కంటే కూడా తక్కువగా నమోదు ● ఫస్టియర్‌లో సగం కళాశాలల్లో 50 శాతం దాటని వైనం ● కేజీబీవీల్లో కాస్త మెరుగ్గా ఉత్తీర్ణత
ప్రభుత్వ
కాలేజీల్లో
2025–26 హాజరైన విద్యార్థులు ఉత్తీర్ణత శాతం
ఫస్టియర్ 2,858 1,394 48.78
సెకండియర్ 2,345 1,497 63.84
2024–25 హాజరైన విద్యార్థులు ఉత్తీర్ణత శాతం
ఫస్టియర్ 2,340 1,146 48.97
సెకండియర్ 2,056 1,353 65.81
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈక్రమంలోనే జూనియర్ కాలేజీలకు భవనాలు, ఇతర వసతులు కల్పించడమే కాక ప్రయోగశాలల్లో సామగ్రి కొనుగోళ్లకు నిధులు కేటాయించింది. ఇదంతా బాగానే ఉన్నా తాజాగా విడుదలైన ఇంటర్‌మీడియట్ ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫలితాలు అంతంత మాత్రంగానే నమోదు కావడం గమనార్హం. జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు గాను ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
50శాతమూ దాటలేదు...
జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కొనసాగుతున్నాయి. ఇందులో ఏ కాలేజీలో కూడా ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం 50శాతానికి మించలేదు. ద్వితీయ సంవత్సరంలో సైతం సగం కాలేజీల్లోనే ఉత్తీర్ణత 50శాతం దాటింది. గతం కంటే ఉత్తీర్ణత శాతం కాస్తే తగ్గినా ఎందుకు ఇలా జరిగిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రథమ సంవత్సరంలో నాగులవంచ జూనియర్ కళాశాల నుంచి హాజరైన 98మంది విద్యార్థులకు గాను 65మంది ఉత్తీర్ణత సాధించగా 66.33శాతం నమోదైంది. ద్వితీయ సంవత్సరం విషయానికొస్తే బనిగండ్లపాడు జూనియర్ కాలేజీలో 60మందికి 56మంది పాస్ కావడంతో 93.33 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సాధించారు. మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లాలో ఇవే అత్యధికం కావడం గమనార్హం. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 91.03 శాతంతో నాగులవంచ కాలేజీ రెండో స్థానాన నిలిచింది. ఇక ఏన్కూరు కాలేజీ మొదటి, ద్వితీయ సంవత్సరం రెండింట్లోనూ చివరి స్థానాన నిలిచింది. ఈ కాలేజీ నుంచి మొదటి సంవత్సరం పరీక్షలకు 78మంది విద్యార్థులు హాజరైతే కేవలం 21మంది(26.92 శాతం), ద్వితీయ సంవత్సరంలో 73మందికి గాను 28మందే ఉత్తీర్ణత (38.36శాతం) ఉత్తీర్ణత సాధించగలిగారు.
జిల్లాలో 14 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 1,440మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1,243మంది ఉత్తీర్ణత సాధించగా 86శాతం ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో చింతకాని కేజీబీవీ విద్యార్థినులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. అలాగే, బోనకల్ కేజీబీవీలో 98.08శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంకెకక్కడా వంద శాతం నమోదు కాకున్నా ఫలితాలు కాస్త మెరుగ్గానే ఉన్నాయని చెప్పొచ్చు. లింగాల కేజీబీవీ 68శాతంతో చివరి స్థానాన నిలిచింది. కాగా, చింతకాని కేజీబీవీ విద్యార్థిని బి.హారిక బైపీసీలో కేజీబీవీల్లోనే రాష్ట్ర మొదటి స్థానాన నిలిచింది.


