ఎంతో వేదనతో
కొన్నేళ్లపాటు శ్రీరామనవమి వేడుకలు..
ఆ తర్వాత మిథిలా స్టేడియానికి మార్చినా..
భక్తుల రద్దీ, వర్షాల వేళ నిత్యకల్యాణం,
హోలీ రోజు పసుపు కొట్టి రామయ్య
పెళ్లి పనులకు శ్రీకారం,
రామదాసు జయంతికి సంగీతోత్సవాలు
పండితులు ఎస్టీజీ శ్రీమన్నారాయణాచార్యుల
సంస్కృత పాఠాలు..
ఆలయ హుండీ లెక్కింపు, ఆదాయ గణనా..
నవమి, ముక్కోటికి లడ్డూల తయారీ..
సత్యనారాయణ స్వామి వ్రతాలు..
ఇలా అన్నీ నా ఒడిలోనే
45 ఏళ్లుగా రామయ్య ఉత్సవాల్లో సేవలు అందించాను.
ఉత్తర మెట్లు తొలగించాక భక్తులకు మార్గంగా,
వీవీఐపీలు, వీఐపీల దర్శనానికి
స్వాగత ద్వారంలా నిలిచాను.
ఇంకా ఏళ్లపాటు సేవలు అందించాలని ఉన్నా..
పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా..
రాములోరి ఆలయ ఆధునికీకరణ పనుల్లో
నా అంతర్ధానం.. ఎంతో వేదనకు గురిచేస్తోంది.
రామయ్య ఆలయం మరింత అందంగా
ముస్తాబవుతుందంటే..
భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయంటే..
నేనెలా అడ్డుగా ఉండగలను. అందుకే తొలగిపోతున్నా..
అయినా ఎక్కడికెళ్తాను లెండీ..
మీ మదిలో చిరకాల జ్ఞాపకంగా నిలిచే ఉంటా.
భక్తిప్రపత్తులతో
చిత్రకూట మండపం
చిత్రకూట మండపం
భద్రాచలం: చిత్రకూట మండపాన్ని శ్రీ భద్రాచల సీతారామాలయ ఉద్దరణ సంఘం ఆధ్వర్యంలో 45 ఏళ్ల క్రితం నిర్మించారు. అప్పటి ఉప ప్రధాని మొరార్జీ దేశాయ్ జూలై 15, 1967లో శంకుస్థాపన చేయగా, 1982లో ఏప్రిల్ 4న నాటి దేవాదాయ శాఖ మంత్రి పీవీ చౌదరి ప్రారంభించారు. అప్పటి నుంచి ఆలయంలో జరిగే పలు ఉత్సవాలకు వేదికగా నిలుస్తోంది. ప్రభుత్వం రామాలయ ఆధునికీకరణ పనుల్లో భాగంగా చిత్రకూట మండపాన్ని పూర్తిగా తొలగించనున్నారు. మరో రెండు, మూడు రోజుల తర్వాత ఇక కనిపించదు.


