మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం.. | - | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం..

Apr 14 2026 7:46 AM | Updated on Apr 14 2026 7:46 AM

ఖమ్మం అర్బన్‌: మహిళల ఆదాయం పెరిగితేనే కుటుంబ సంక్షేమం సాధ్యమవుతుందని.. ఈవిషయాన్ని పరిగణనలోకి తీసుకున్న తమ ప్రభుత్వం మహిళా సాధికారతకు కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఆతర్వాత టీఎన్జీవోస్‌ హాల్‌లో అంగన్‌వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏటా రూ.20 వేల కోట్ల మేర వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. అంతేకాక ఉచిత బస్సు ప్రయాణానికి రూ.10వేల కోట్లు వ్యయం చేస్తున్నట్లు చెప్పారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఖమ్మం నగరంలో 2,500 ఇళ్లు మంజూరు చేయగా, వచ్చే ఏడాది మరో 3,500మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లు సేవా దృక్పథంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. చిన్నచిన్న సమస్యల పేరుతో ఉద్యమాలు చేయొద్దని సూచించిన ఆయన... వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త భవనాలను మంజూరు చేయగా త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. అనంతరం ఖమ్మం నగరపాలక సంస్థ కొనుగోలు చేసిన రహదారులు ఊడ్చే మూడు యంత్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, మేయర్‌ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహారా, జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్‌, కార్పొరేటర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

Advertisement
 
Advertisement
Advertisement