రెవెన్యూ వ్యవస్థలో నిర్లక్ష్యాన్ని సహించం
● గర్భిణుల గుర్తింపు, పర్యవేక్షణ తప్పనిసరి ● పాఠశాలల్లో పిల్లల భద్రతకు ప్రత్యేక చర్యలు ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలో మాతృ, శిశు మరణాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా అధికారులు కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ప్రతీ ప్రసవం సురక్షితంగా జరుగుతుందనే భావన వచ్చేలా ప్రతీ పీహెచ్‌సీ పరిధిలో గర్భిణులను గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే, అంగన్‌వాడీ టీచర్లు పాఠశాలకు వెళ్లనిపిల్లలు, అనాథలు, బాల కార్మికులు, సదరం కేటగిరీ పిల్లల వివరాలు సేకరించి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని చెప్పారు. అంతేకాక పాఠశాలల్లో బాలల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పిల్లల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.
● ఖమ్మంక్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తూ, గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల కట్టడికి చర్యలు చేపట్టాలని తెలిపారు. అంతేకాక రాహ–వీర్, పీఎం రాహత్ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు. అలాగే, ప్రైవేట్ పాఠశాలు, వాహనాల డ్రైవర్ల ఫిట్‌నెస్, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కాగా, ఈనెల 16న మండల స్థాయిలో సభల నిర్వహణ, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో పరిశుభ్రతపై సూచనలు చేశారు.
● ఖమ్మం సహకారనగర్: జిల్లాలో పరిపాలన మరింత సమర్థవంతంగా చేపడుతూ ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రతీ సోమవారం సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. వైరా ప్రాంతంలో మట్టి తరలింపునకు అనుమతులు, ఈ–ఆఫీస్ ద్వారా ఫైళ్ల పరిష్కారం, పంట ఉత్పత్తులు తరలించే వాహనాలకు జీపీఏస్ ట్రాకింగ్ ఏర్పాటు, తాగునీటి సమస్యల పరిష్కారంపై సూచనలు చేశారు. కాగా, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌లో జిల్లాను ముందు వరుసలో నిలిపిన వైద్య అధికారులను కలెక్టర్ అభినందించారు.
● ప్రజలు అందించే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో ప్రజావాణిలో భాగంగా ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించాక ఆయన మాట్లాడారు. ఈ సమావేశాల్లో డీఆర్‌ఓ ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఎంహెచ్‌ఓ రామారావు, డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్‌గౌడ్, డీడబ్ల్యూఓ వేల్పుల విజేత, డీసీపీఓ విష్ణువందన, ఇన్‌చార్జ్ ఆర్‌టీ జే.ఎన్.శ్రీనివాసరావు, ఏఎంవీఐలు జి. దినేష్, జి.సుమలత, ఆర్టీఏ మెంబర్ జి.వెంకన్న, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
● జిల్లాలో నానాటికీ ఉష్ణోగ్రత పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ ఓ ప్రకటనలో సూచించారు. అత్యవసరమైతే తప్పబయటకు రావొద్దని, చిన్నారులు, వయోవృద్ధులు ఇంటికే పరిమితం కావాలని తెలిపారు. ఎండలో పనిచేసే కార్మికులు తరచుగా నీటితో పాటు ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా కాపాడుకోవచ్చని చెప్పారు. ఎవరికై నా వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
ఖమ్మం సహకారనగర్: రెవెన్యూ వ్యవస్థలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, ఎవరైనా అలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో ఆయన భూసేకరణ, భూభారతి, సాదా బైనామా, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా భూసేకరణలో వేగం పెంచాలన్నారు. అలాగే, భూభారతి, సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచి సమయం నిర్దేశించుకుని పరిష్కరించాలని తెలిపారు. పట్టాదారు యాజమాన్యంపై సందేహాలు ఉంటే నిబంధనల ప్రకారం రద్దు చేయాలే తప్ప స్లాట్ పెండింగ్‌లో ఉంచొద్దని సూచించారు.


