ఐదు గ్రామాలు వచ్చేవరకు పోరు | - | Sakshi
Sakshi News home page

ఐదు గ్రామాలు వచ్చేవరకు పోరు

Apr 14 2026 7:22 AM | Updated on Apr 14 2026 7:22 AM

భద్రాచలంటౌన్‌: ఏపీలో విలీనంచేసిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో తెచ్చేందుకు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడతానని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో (భద్రాచలంలో) కలపాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ‘భద్రాద్రి పునరేకీకరణ’ సభ నిర్వహించారు. ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించి మాట్లాడారు. భద్రాద్రి ప్రాంత ఆడబిడ్డగా ఈ నేల, హక్కుల కోసం పోరాడతానని అన్నారు. ఇది భద్రాద్రి రామయ్య ఆదాయంతో ముడిపడి ఉన్న సున్నితమైన సమస్య అని పేర్కొన్నారు. సమస్యను గతంలోనే పార్లమెంటులో ప్రస్తావించానని, కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పా రు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు ఈ విషయంలో సానుకూలంగా స్పందించి ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే పాదయాత్ర నిర్వహిస్తానని తెలిపారు.

ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరగాలి..

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం చర్చించుకుని, కేంద్ర ప్రభుత్వానికి అధికారిక ప్రతి పాదనలు పంపడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, భౌగోళిక ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ పొదెం వీరయ్య మా ట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆర్డినెన్స్‌ ద్వారా ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనీసం ఐదు గ్రామ పంచాయతీలనైనా తిరిగి తెలంగాణలో విలీనం చేసేలా ఇద్దరు ముఖ్యమంత్రులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌ రెడ్డి మాట్లాడుతూ ఏడు మండలాలను అశాసీ్త్రయంగా ఆంధ్రప్రదేశ్‌లో కలపడంతో స్థానిక ప్రజలు 11 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సాంకేతికంగా ఆ ఐదు గ్రామాలు ఏపీలో ఉన్నా, అక్కడి ప్రజల మనసంతా భద్రాచలం రామయ్య పాదాల చెంతనే ఉందని చెప్పారు. ప్రస్తుతం భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్లాలన్నా 9 కిలోమీటర్ల మేర ఆంధ్రా ప్రాంతం గుండా వెళ్లాల్సి వస్తోందని అన్నారు. ఆ ఐదు గ్రామాలను తక్షణమే తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలంగాణ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కన్వీనర్‌ ఏలూరి శ్రీనివాసరావు, చాడా రవికుమార్‌, ఖమ్మం జిల్లా జేఏసీ చైర్మన్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌, కన్వీనర్‌ కొని దెల శ్రీనివాస్‌, భద్రాద్రి జిల్లా జేఏసీ చైర్మన్‌ అమర్నేని రామారావు, చైతన్యభార్గవ్‌, వీరబాబు, డెక్క నరసింహారావు, గగ్గూరి బాలకృష్ణ పాల్గొన్నారు.

రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి

Advertisement
 
Advertisement
Advertisement