రైతు ఇంట్లో నెమలి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రైతు ఇంట్లో నెమలి స్వాధీనం

Apr 14 2026 7:22 AM | Updated on Apr 14 2026 7:22 AM

ఖమ్మంరూరల్‌: ఖమ్మంరూరల్‌ మండలంలోని తీర్థాలలోని ఓ రైతు ఇంట్లో నెమలి ఉందన్న సమాచారంతో అటవీ శాఖాధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన రైతు మాలోత్‌ కిషన్‌ మొక్కజొన్న చేనులో ఇటీవల గాయాలతో పడి ఉన్న నెమలిని తీసుకొచ్చి ఇంట్లో సపర్యలు చేయడమే కాక బోనులో పెట్టి మేత వేస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో కూసుమంచి డిప్యూటీ రేంజర్‌ కేవీ.రామారావు గ్రామానికి వెళ్లి నెమలిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చారా, లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ కావాలనే బంధించినట్లే తేలితే వణ్యప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

బొగ్గు టిప్పర్‌ దగ్ధం

మణుగూరుటౌన్‌: ిసంగరేణి మణుగూరు ఏరియాలోని కొండాపురం కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌(కేసీహెచ్‌పీ) వద్ద షార్ట్‌ సర్క్యూట్‌తో బొగ్గు టిప్పర్‌ సోమవారం దగ్ధమైంది. పట్టణంలోని శేషగిరినగర్‌కి చెందిన కుమార్‌ టిప్పర్‌కు డీజిల్‌ పైప్‌ లీకేజీ ఉన్నట్లు సమాచారం. కాగా రోజూలాగే బొగ్గు లోడింగ్‌ కోసం రాగా, మధ్యాహ్నం రెండు గంటలకు ఓవర్‌ హీట్‌ కారణంగా టిప్పర్‌లో మంటలు చెలరేగి ఎగసిపడ్డాయి. దీంతో టిప్పర్‌ పూర్తిగా దగ్ధమైంది. కాగా, ప్రమాద సమయంలో టిప్పర్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

మహిళ ఆత్మహత్య

సుజాతనగర్‌: అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ జరిగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సుజాతనగర్‌ మండలంలో సోమవారం జరిగింది. ఎస్సై రమాదేవి కథనం ప్రకారం... మండలంలోని లెనిన్‌నగర్‌కు చెందిన తమ్మిశెట్టి నాగమణి (48) తన చెల్లెలుకు ఏడాదిన్నర క్రితం రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చింది. తిరిగి ఇవ్వాలని అడుగగా, చెల్లెలు పలుమార్లు వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో మనస్తాపం చెందిన అక్క నాగమణి ఈనెల 8న ఎలుకల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement