ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత వర్గాలకు సంక్షేమ పథకాల అమలులో వివక్ష కనబరుస్తున్నాయని దళిత హక్కుల పోరాట సమితి(డీహెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఏసురత్నం విమర్శించారు. సబ్ ప్లాన్ నిధులను కేవలం బడ్జెట్‌లో కేటాయిస్తున్నా పూర్తి స్థాయిలో వినియోగించడం లేదని తెలిపారు. డీహెచ్‌పీఎస్ జిల్లా మహాసభ సోమవారం ఖమ్మంలో నిర్వహించగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా దళితుల కోసం కేటాయిస్తున్న నిధులు పక్కదారి పడుతుండడంతో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిపోతున్నారని తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ 20 శాతం ఉన్న దళితులకు 16 శాతమే కేటాయింపులు చేశారని, అలాకాకుండా జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి, డీహెచ్‌పీఎస్ నాయకులు యంగల ఆనందరావు, పగిడిపల్లి ఏసు, తడికమళ్ల ఏబు, తోటపల్లి సీతారాములు, మామిడాల కిరణ్, యామాల గోపాల్‌రావు, సృజన, వరదా నర్సింహారావు, నారపోగు వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా నూతన కమిటీ ఎన్నిక..
డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా పగిడిపల్లి ఏసు, యంగల ఆనందరావును మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మొత్తం 31 మంది కౌన్సిల్ సభ్యులు, 18మంది కార్యవర్గ సభ్యులతో పాటు 11మంది ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా తడికమళ్ల ఏబు, ఉపాధ్యక్షులుగా నాగేశ్వరరావు, సీతారాములు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా యామాల గోపాలరావు, సహాయ కార్యదర్శులుగా వరదా నర్సింహారావు, మామిడాల కిరణ్, నారపోగు వసంతరావు, కోశాధికారిగా సృజన ఎన్నికయ్యారు.
డీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏసురత్నం


