ఫీజు చెల్లింపునకు
20వరకు అవకాశం
రాష్ట్రస్థాయిలో జిల్లా విద్యార్థుల సత్తా
● ఫస్టియర్‌లో 72.06, సెకండియర్‌లో 81.60 శాతం ఉత్తీర్ణత ● రాష్ట్రంలో జిల్లాకు 4, 6వ స్థానాలు
ఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ప్రథమ సంవత్సరంలో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానం దక్కించుకోగా, ద్వితీయ సంవత్సరంలో ఆరో స్థానాన నిలిచింది. కాగా, గతేడాది ప్రథమ సంవత్సరంలో మూడో స్థానం, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఐదో స్థానం దక్కింది. ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగినప్పటికీ స్థానాలు మాత్రం తగ్గాయి. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 72.06శాతం, ద్వితీయ సంవత్సరంలో 81.60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే, ఒకేషనల్ విభాగం నుంచి ప్రథమ సంవత్సరంలో 2,190 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,321 మంది(60.32 శాతం), ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 1,928 మంది హాజరుకాగా 1,429 మంది(74.12శాతం) ఉత్తీర్ణులయ్యారు.
బాలికలదే పైచేయి
ప్రథమ సంవత్సరం పరీక్షలకు బాలురు 7,618 మంది హాజరైతే 4,918 మంది(65.51శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 7,681మందికి 6.044మంది(78.69 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇక ద్వితీయ సంవత్సరం పరీక్షలకు బాలురు 7,282 మందికి 5,498 మంది(75.50శాతం), బాలికలు 7,345మందిలో 6,438 మంది(87.65శాతం) ఉత్తీర్ణులయ్యారు.
రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు
ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో అత్యధికంగా 996మార్కులు, బైపీసీలో 997 మార్కులు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు సాధించారు. అంతేకాక పలువురికి 900కిపైగా మార్కులు వచ్చాయి. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 468మార్కులు పలువురు విద్యార్థులు సాధించగా, 400కిపైగా మార్కులు చాలామంది సాధించారు. ఇదే సమయాన జిల్లాలోని కేజీబీవీలు, సంక్షేమ శాఖల గురుకులాలు, ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు సైతం పోటాపోటీగా మార్కులు సాధించడం విశేషం.
పెరుగుతున్న ఉత్తీర్ణత
గడిచిన మూడేళ్లుగా జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు మెరుగుపడుతున్నాయి. గత మూడేళ్ల ఫలితాలు పరిశీలిస్తే ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 3 – 8శాతం మెరుగుదల నమోదవుతోంది. ఈసారి మరింత మెరుగైన ఫలితాలతో రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపు లభించినట్లయింది.
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 20వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు సూచించారు. వచ్చే నెల 13వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈమేరకు ఈనెల 20వ తేదీలోగా ఆయా కళాశాలల్లో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కూడా ఈనెల 20వ తేదీ వరకు tgbie.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రీకౌంటింగ్ కోసం ప్రతీ సబ్జెక్టుకు రూ.100, రీ వెరిఫికేషన్‌కు రూ.800 చొప్పున ఫీజు ఉంటుందన్నారు.


