వచ్చే నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి | - | Sakshi
Sakshi News home page

వచ్చే నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

రఘునాథపాలెం: ఖమ్మం నియోజకవర్గానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వచ్చే నెలాఖరులోగా పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మంలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం ఆయన గృహ నిర్మాణ సంస్థ అధికారులతో సమీక్షించారు. ఇళ్ల నిర్మాణ పురోగతిని నిరంతరం పరిశీలిస్తే, ఎక్కడైనా ఆలస్యమైతే లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలి పారు. ఇంకా నిర్మాణం మొదలుపెట్టని లబ్ధిదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇలాంటి వారికి ఇళ్లు అవసరం లేకపోతే గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు మంజూరు చేయాలని తెలిపారు. రఘునాథపాలెం ఎంపీడీఓ అశోక్‌కుమార్‌, హౌసింగ్‌ అధికారులు శ్రీనివాస్‌, రామకృష్ణ, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్‌ చైర్మన్‌ యరగర్ల హన్మంతరావు, కార్పొరేటర్లు లకావత్‌ సైదులు, మలీదు వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

హిమవంతరావు ఆశయాలు సాధించాలి

ఖమ్మం సహకారనగర్‌: నిజాయితీ, నిబద్ధతకు నిలువుటద్దంలా నిలిచిన సామినేని హిమవంతరావు ఆశయాలు, ఆలోచనలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పీఆర్‌టీయూ వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్సీ హిమవంతరావు విగ్రహాన్ని ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ పీఆర్‌టీయూ స్థాపన ద్వారా ఉపాధ్యాయుల హక్కుల సాధనలో హిమవంతరావు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా కార్యాలయం రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని అభినందించారు. ఇందుకు సహకరించిన హిమవంతరావు కుటుంబీకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్‌ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర బిక్షంగౌడ్‌, ఆడిట్‌ కమిటీ చైర్మన్‌ సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, మేయర్‌ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల

Advertisement
 
Advertisement
Advertisement