చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఆర్‌ఎఫ్‌సీఎల్ కంపెనీకి చెందిన 2,965.14 మెట్రిక్ టన్నుల యూరియా ఆది వారం చేరింది. ఈ యూరియాను మూడు జిల్లాలకు సరఫరా చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఈమేరకు ఖమ్మం జిల్లాకు 585.14 మె.టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 880 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 500 మెట్రిక్ టన్నులు సరఫరా చేయగా, మిగతా వేయి మెట్రిక్ టన్నుల ను బఫర్ స్టాక్‌గానిల్వ చేశామని వెల్లడించారు.
ఐదో రోజుకు చేరిన విద్యుత్ కార్మికుల సమ్మె
ఖమ్మంవ్యవసాయం: సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం విద్యుత్ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం ఐదో రోజుకు చేరింది. సమ్మెలో ఆర్టిజన్లు, అన్‌మ్యాన్డ్ కార్మికులు, మీటర్ రీడర్లు, కలెక్షన్ ఏజెంట్లు, స్టోర్ హమాలీలు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో కార్మికులకు పలు యూని యన్ల నాయకులు ఎం.శ్రీనివాసరావు, టి.శేషగిరిరావు, నాగేశ్వరరావు సంఘీభావం తెలిపి మాట్లాడారు. టీవీఏఈ జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ వల్లాల యుగంధర్, ప్రతినిధులు సురేందర్‌రెడ్డి, ఉపేందర్, రామకృష్ణ, వెంకన్న, అన్వర్ జానీపాషా, నఫీస్, మోబిన్ నస్రీన్, పెద్ది భాస్కర్, వేణుమోహన్, కోటేశ్వరరావు, నర్సింహారావు, మంగ్యానాయక్ పాల్గొన్నారు.
భానుడి భగభగ
పలు ప్రాంతాల్లో గరిష్టస్థాయి ఉష్ణోగ్రతలు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో భానుడి ప్రతా పం రోజురోజుకు పెరుగుతోంది. ఈ సీజన్‌లోనే గరిష్టంగా ఆదివారం 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 10గంటలకే మొదలవుతున్న ఎండ మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరడమే కాక సాయంత్రం వరకు కొనసాగుతోంది. దీనికితోడు వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలాచోట్ల మధ్యాహ్నం ప్రధాన రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి.
40 డిగ్రీలకు పైగానే...
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అప్రమత్తత(అలర్ట్) స్థాయికి చేరాయి. ఆదివారం పలుచోట్ల 40 – 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కల్లూరు, గుబ్బగుర్తి(కొణిజర్ల మండలం)ల్లో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఖానాపురం(ఖమ్మం అర్బన్)లో 41.5, కలెక్టరేట్ వద్ద, మధిరలో 41.2, పెనుబల్లిలో 40.8 సిరిపురంలో 40.7, రావినూతలలో 40.4, పెద్దగోపతి, తిమ్మారావుపేట, కొణజిర్లలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. మిగిలిన ప్రాంతాల్లోనూ 35–40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదు కావడంతో మున్ముందు ఎలా ఉంటుందోనని జనం బెంబేలెత్తిపోతున్నారు.


