ఖమ్మంవైద్యవిభాగం: మహిళల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే వ్యాధుల్లో గర్భాశయ ముఖద్వార కేన్సర్ ముందు స్థానాన నిలుస్తోంది. ఈమేరకు కేన్సర్ కట్టడికి బాలికలకు ముందస్తుగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని 14 – 15 ఏళ్ల బాలికలకు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన వ్యాక్సిన్ ఇస్తుండగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నిత్యం పర్యవేక్షిస్తుండడంతో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానాన నిలిచింది.
రాష్ట్రంలోనే ముందంజ
జిల్లాలో 14–15 ఏళ్ల బాలికలు 15వేల మంది ఉంటారని అంచనా. ఇందులో ఇప్పటి వరకు 3,040 మంది బాలికలకు వ్యాక్సిన్ వేశారు. ఇది రాష్ట్రంలోనే అత్యధికమని అధికారులు వెల్లడించారు. హెచ్‌పీవీ వైరస్‌తో గర్భాశయ ముఖద్వార కేన్సర్ మాత్రమే కాక మరికొన్ని ప్రమాదకర కేన్సర్లు సోకే ప్రమాదముందని చెబుతున్నారు. ఈమేరకు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వారా కేన్సర్‌తో పాటు ఆరు రకాల కేన్సర్ల నుంచి రక్షణ లభిస్తుందని వైద్యులు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్‌తో శరీరంలో బలమైన యాంటీబాడీలు ఏర్పడి దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి లభిస్తుందని, తద్వారా కేన్సర్ సోకే ముప్పు గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు. ఇందులో భాగంగా వ్యాక్సిన్‌పై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు విస్తృత అవగాహన కల్పిస్తుండడంతో బాలికలకు వేయించేందుకు తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రితో పాటు సీహెచ్‌సీలు, 24 గంటల వైద్య కేంద్రాలు కలిపి 12కేంద్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని అధికారులు వెల్లడించారు. త్వరలోనే పీహెచ్‌సీల్లో కూడా ప్రారంభించనున్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లాలో ఇప్పటివరకు
3,040 మందికి టీకా


