మెండుగా లాభాలు | - | Sakshi
Sakshi News home page

మెండుగా లాభాలు

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వేసవిలో కూరగాయల సాగు మేలు తక్కువ వ్యవధిలోనే చేతికి లాభాల పంట ఎండ తట్టుకునే రకాలు ఎంచుకుంటే మంచిది

మండే

ఎండల్లో..

రైతులు ఎండాకాలంలో నీటి లభ్యత తక్కువగా ఉంటుందనే భావనతో పంటల సాగుకు దూరమవుతారు. కానీ ఉష్ణోగ్రతను తట్టుకొని కొద్ది పాటి నీటితోనే అధిక దిగుబడి ఇచ్చే పంటలు ఎన్నో ఉన్నాయి. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తే తక్కువ సమయాన లాభాలను గడించొచ్చు. అంతేకాక కూరగాయల, ఆకుకూరలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. ఈమేరకు వేసవిలో ఉష్ణోగ్రతలను తట్టుకునే కూరగాయల సాగుకు ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.

ఖమ్మంవ్యవసాయం: కాస్త నీటి వనరులు ఉంటే వేసవిలో కూరగాయలు, ఆకుకూరల సాగు లాభా లు తెచ్చిపెడుతుంది. సాధారణంగా వేసవిలో కూరగాయల సాగు తగ్గడంతో లభ్యత లేక మార్కెట్‌లో డిమాండ్‌తో పాటు ధరలు పెరుగుతాయి. అయితే, గత ఏడాది వానాకాలంలో విస్తారంగా కురిసిన వానలతో జిల్లాలోని జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉండడమే కాక సాగర్‌ నీటి విడుదలతో భూగర్భజలాలు సైతం ఆశించిన స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యాన జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూరగాయలు, ఆకుకూరలను పండించే అవకాశం ఉన్నందున రైతులు ముందుకొస్తే తక్కువ వ్యవధిలో లాభాలు గడించొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈనేపథ్యాన వేసవిలో సాగుకు అవకాశం ఉన్న ఆకుకూరలు, కూరగాయలు, ఎంచుకోవాల్సిన రకాలపై ఖమ్మం జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి ఎం.వీ.మధుసూదన్‌ ఇచ్చిన సూచనలు ఇలా ఉన్నాయి.

ఇవి మంచిది..

పలు రకాల కూరగాయలు, అకుకూరల పంటలు వేసవిలో ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి. దోస, పొట్ల, గోరుచిక్కుడు, బెండ, దొండకాయ వంటి కూరగాయలతో పాటు అన్నిరకాల ఆకుకూరలను వేసవిలో సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయి.

దొండసాగు: దొండ ఒకసారి సాగు చేస్తే ఆరేళ్ల కాలం దిగుబడి వస్తూనే ఉంటుంది. నీటి అవసరం కూడా తక్కువగా ఉంటుంది. రైతులు ముందస్తు ప్రణాళిక రూపొందించుకుంటే నిరంతరాయంగా దిగుబడి సాధించవచ్చు.

కాకర : కాకరకు మార్కెట్‌లో ఎల్లవేళలా డిమాండ్‌ ఉంటుంది. ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడంతో కాలంతో పని లేకుండా అన్ని సమయాల్లో మంచి ధర పలుకుతుంది. పంట వేసిన 80 రోజుల్లో దిగబడి మొదలై నాలుగు నెలలు కొనసాగుతుంది. అయితే, ఎండ తీవ్రతను తట్టుకుని దిగుబడి ఇచ్చే రకాలు ఎంచుకోవాలి. వీటిలో పూసా–2, మౌసమి, యూఎస్‌ 6214, కోబ్రా హైబ్రిడ్‌ రకాలు ఉన్నాయి.

సోర: ఉష్ణోగ్రతలను తట్టుకుని వేగంగా పెరిగే పంటల్లో సోర ఒకటి. పంటవేసిన 50రోజుల్లో దిగుబడి మొలై 60 రోజుల వరకు నిరంతరం వస్తూనే ఉంటుంది. అంతేకాక వేసవిలో ఈ పంటకు డిమాండ్‌ ఎక్కువ. పూసా నవీన్‌, ఆర్క బీహార్‌, అంకుర్‌ హెచ్‌బీజీ, సింజె వంటి రకాలు సాగు చేసుకోవచ్చు.

బెండ: వేసవిలో ఉష్ణోగ్రతను తట్టుకుని ఆదా యాన్ని ఇచ్చే కూరగాయల పంటల్లో బెండ ఒకటి. పంట నాటిన 45 రోజుల్లో ఉత్పత్తి మొలై రెండు నెలల పాటు నిరంతరం కొనసాగుతుంది. బెండలో ఆర్క అనామిక్‌, పూసా పావని రకాలు వేసవిలో మంచి దిగుబడులను ఇస్తాయి.

బీరకాయ: ఉష్ణోగ్రతలోనూ అధిక దిగుబడి ఇచ్చే కూరగాయల పంటల్లో బీర కూడా ఉంది. బీర నాటిన 50 – 60 రోజుల్లో దిగుబడి మొదలై రెండు నెలలు నిరంతరం వస్తూనే ఉంటుంది. ఈ పంటలో ఆర్కా సుజాత్‌, పూసా నస్తార్‌, నాగ హైబ్రిడ్‌, యూఎస్‌ 7109 రకాలు మేలైనవిగా చెబుతారు.

ఆకుకూరలు: వేసవిలో ఆకుకూరలు తినేందుకు ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు. తద్వారా ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆకుకూరలకు డిమాండ్‌ ఉంటుంది. అయితే అన్ని రకాల ఆకుకూరలు ఎండ తీవ్రతను తట్టుకోలేవు. పాలకూర, కొత్తిమీర, చుక్కకూర త్వరగా దెబ్బతినే అవకాశం ఉండగా.. తోటకూర, మెంతికూరకు ఎండలను తట్టుకునే శక్తి ఉంటుంది. తోటకూరలో అర్క, అరుణిమ రకాలు సాగు చేసుకోవచ్చు. పంట వేసిన నెలలోగా దిగుబడి మొదలై రెండు మాసాలు కొనసాగుతుంది. మెంతికూరలో పూసా ఎర్లీ, బంచింగ్‌ రకాలు ఉత్తమమైనవి. ఇది కూడా రెండు నెలల పాటు దిగుబడి ఇస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement