● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
వైరా: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల బోధన, హాస్టల్ భవనాల బేస్‌మెంట్ ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. వైరాలో నిర్మిస్తున్న గురుకుల పాఠశాల భవనాలను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇక్కడ నాలుగు జూనియర్, తొమ్మిది సీనియర్ హాస్టల్ బ్లాక్‌లు నిర్మిస్తుండగా, నెలాఖరుకు బేస్‌మెంట్ స్థాయి పూర్తి కావాలని స్పష్టం చేశారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల భవనాలు కొనసాగుతున్నాయని తెలిపారు. భూ సంబంధిత సమస్యలన్నీ పరిష్కారమైనందున పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
జమలాపురంలో
ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అర్చకులు అభిషేకం చేశారు. అనంతరం స్వామి, అలివేలుమంగ, పద్మావతి అమ్మవార్ల ను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యా ణం, స్వామి పల్లకీ సేవ నిర్వహించగా తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చెదలు పట్టిన మాత్రలపై డీఎంహెచ్‌ఓ ఆరా
నేలకొండపల్లి: మండలంలోని మంగాపురంతండా జీపీ కార్యాయంలో శుక్రవారం నిర్వహించిన ఆరోగ్య అవగాహన సదస్సులో చెదలు పట్టిన మాత్రలు ప్రదర్శించడంపై డీఎంహెచ్‌ఓ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ‘సాక్షి’లో ‘చెదలు పట్టిన మాత్రలతో సదస్సు!’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో శనివారం స్పందించిన ఆయన వివరాలు ఆరా తీశారు. అంతేకాక చెదలు పట్టిన మాత్రలను ఎందుకు ప్రదర్శించారు.. చెదలు పట్టడానికి కారణాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో పల్లె దవాఖానా వైద్యాధికారి మాధవి చెరువుమాధారం పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రావణ్‌కుమార్‌కు వివరణ సమర్పించగా ఆయన డీఎంహెచ్‌ఓకు పంపించారు.
పదేళ్ల తర్వాత శస్త్రచికిత్స !
● అధికారుల చొరవతో సీహెచ్‌సీలో
సౌకర్యాలు
నేలకొండపల్లి: నేలకొండపల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో పదేళ్ల తర్వాత సిజేరియన్ ద్వారా ప్రసవం చేశారు. కొంతకాలంగా ఆస్పత్రిలో సౌకర్యాలు లేకపోవడంతో సాధారణ ప్రసవాలు మాత్రమే చేస్తున్నారు. ఈమేరకు అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ కలెక్టర్ అనుదీప్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించారు. అంతేకాకుండా పలుమార్లు స్వయంగా పరిశీలించి పనులు చేయించడంతో అన్ని వసతులు సమకూరాయి. ఈమేరకు దానవాయిగూడెంకు చెందిన గర్భిణి చందన పురినొప్పులతో శనివారం ఆస్పత్రిలో చేరగా ఇబ్బంది ఏర్పడిందని గుర్తించారు. ఆపై వైద్యులు మంగళ, కె.రాజేష్ శస్త్రచకిత్స చేయడంతో ఆమె క్షేమంగా బిడ్డకు జన్మనిచ్చింది. శస్త్రచికిత్సలో ఉద్యోగులు కవిత, ప్రశాంతి పాలుపంచుకున్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల కమిటీ ఎన్నిక
ఖమ్మంసహకారనగర్: నాలుగో తరగతి రిటైర్డ్ ఉద్యోగుల ఉమ్మడి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఖమ్మం ఇందిరానగర్‌లోని సంఘం భవనంలో శనివారం ఈ ఎన్నిక జరిగింది. నూతన అధ్యక్షుడిగా కోడి లింగయ్య, ఉపాధ్యక్షుడిగా ఆర్.వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా పి.గణపతిరెడ్డి, సహాయ కార్యదర్శిగా కె.శ్రీను, కోశాధికారిగా గట్టికొండ నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా గిరిజాకుమారి, ఉమాదేవి, అంజమ్మ, కె.వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.


