కోతులను అదిలించబోయి రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

కోతులను అదిలించబోయి రైతు మృతి

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

కొణిజర్ల: వరి పొలాన్ని ఆగం చేస్తున్న కోతులను అదిలించేందుకు ఓ రైతు రేకులషెడ్డుపైకి ఎక్కగా.. అక్కడ రేకు విరగడంతో కింద పడి మృతి చెందాడు. కొణిజర్ల మండలం లాలాపురంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నామా శ్రీనివాసరావు(50) అదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు. పొలంలో కోతులు చేరి పాడు చేస్తుండగా శ్రీనివాసరావు, మరో వ్యక్తికితో కలిసి వెళ్లాడు. అక్కడ కోతులు సమీపంలోని సిమెంట్‌ బ్రిక్స్‌ ఫ్యాక్టరీ రేకులషెడ్డు పైకిచేరగా, శ్రీనివాసరావు కూడా పైకి వెళ్లడంతో శిథిలావస్థఽలో ఉన్న రేకు విరిగి పైనుంచి ఫ్యాక్టరీలోని యంత్రాలపై పడ్డాడు. తలకు తీవ్ర గాయాలైన ఆయన్ను కొణిజర్లలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జి.సూరజ్‌ తెలిపారు.

108 వాహనంలో గర్భిణి ప్రసవం

చింతకాని: ఏపీలోని గంపల గూడెం మండలం నెమలికొణిజర్ల గ్రామానికి చెందిన గర్భిణి రమాదేవి శనివారం 108 వాహనంలో ప్రసవించింది. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమెను కుటుంబీకులు ప్రసవం కోసం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, అక్కడి వైద్యులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి సిఫారసు చేయగా 108 వాహనంలో తీసుకెళ్తున్నారు. ఈ క్రమాన నాగులవంచ సమీపాన పురిటి నొప్పులు ఎక్కువవడంతో రమాదేవికి 108 సిబ్బంది గుజ్జర్లపూడి రామయ్య, పేరెల్లి రవీంద్రబాబు ప్రసవం చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా సిబ్బందికి ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

గంగదేవిపాడులో పట్టపగలే చోరీ

రూ.12 లక్షల సొత్తు అపహరణ

తల్లాడ: మండలంలోని గంగదేవిపాడు గ్రామంలో శనివారం పట్టపగలే చోరీ జరిగింది. గ్రామానికి చెందిన శిలివేరు నరసింహారావు ఇంటికి తాళం వేసి వెళ్లగా దొంగలు తాళాలు పగులగొట్టి ప్రవేశించారు. ఆపై బీరువా తాళాలు సైతం పగులగొట్టి తొమ్మిది తులాల బంగారు నెక్లెస్‌, గొలుసు, ఉంగరాలు, మాటీలు, చెంప సవరాలే కాక రూ.90 వేల నగదు చోరీ చేశారు. మొత్తంగా రూ.12 లక్షల సొత్తు చోరీ జరిగిందని.. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో క్లూస్‌టీమ్‌ బృందం పరిశీలించి ఆధారాలు సేకరించింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు తల్లాడ ఎస్‌ఐ వెంకటకృష్ణ తెలిపారు.

గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌

2.440 కిలోల గంజాయి స్వాధీనం

బోనకల్‌: బోనకల్‌ పోలీసులు శనివారం నిర్వహించిన తనిఖీల్లో విజయవాడకు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ పి.వెంకన్న కథనం మేరకు.. బోనకల్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జి సమీపాన శనివారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. బైక్‌పై వస్తున్న వ్యక్తి పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేయగా అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి విజయవాడలోని చిట్టినగర్‌ ప్రాంతానికి చెందిన పోసాని రవిరాజుగా గుర్తించి, ఆయన బ్యాగ్‌లో 2.440 కిలోల గంజాయి ఉండగా స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన రవి, కృష్ణ, రవీంద్ర, తమ్మిశెట్టి కిరణ్‌ నుంచి గంజాయి సేకరించి అధిక ధరతో అమ్మడానికి వెళ్తున్నట్లు అంగీకరించాడు. దీంతో ఐదుగురిపై కేసు నమోదు చేసి రవిరాజును రిమాండ్‌కు తరలించిట్లు ఎస్‌ఐ తెలిపారు.

గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

ఖమ్మంరూరల్‌: సాగర్‌ కాల్వలో గల్లంతైన ఏదులాపురానికి చెందిన పదో తరగతి విద్యార్థి పుట్టబంతి రామకృష్ణ(16) మృతదేహం శనివారం లభ్యమైంది. ఓ స్నేహితుడి పుట్టినరోజు ఉండడంతో శుక్రవారం రామకృష్ణ తదితరులు మద్దులపల్లిలోని సాగర్‌ కాల్వ వద్ద వేడుక చేసుకున్నారు. అనంతరం సాగర్‌ కాల్వలోకి ఈతకు దిగిన సమయాన ఆయన గల్లంతయ్యాడు. శనివారం ఉదయం గత ఈతగాళ్లతో గాలిస్తుండగా గొల్లగూడెం వద్ద మృతదేహం లభించింది. అయితే, మృతదేహంపై గాయాలు ఉండడం, ముక్కు నుంచి రక్తం రావడంతో రామకృష్ణ స్నేహితులే కొట్టి కాల్వలో వేసి ఉంటారని ఆయన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement