ఐటీడీఏ కృషి అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ కృషి అభినందనీయం

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

భద్రాచలం: గిరిజన మహిళలు, నిరుద్యోగులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు భద్రాచలం ఐటీడీఏ చేస్తున్న కృషి అభినందనీయమని న్యూఢిల్లీలోని మినిస్టర్‌ ఆఫ్‌ ట్రైబల్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌ వమాలి దికాకు అన్నారు. శనివారం హైదరాబాదులోని డీఎస్‌ఎస్‌ భవనంలో రెండు తెలుగు రాష్ట్రాల ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సంక్షేమ పథకాల అమలుపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. భద్రాచలం ఐటీడీఏ తరఫున ఏపీఓ జనరల్‌ డేవిడ్‌రాజ్‌ ఆధ్వర్యంలో అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ సర్వేశ్వర్‌రెడ్డి, టీసీఆర్‌టీఎన్‌టీ డైరెక్టర్‌ సమజ్వాల, ములుగు ఐటీడీఏ పీఓ దివాకర్‌ సమక్షంలో శాలువాతో సత్కరించి గిరిజన ఉత్పత్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రారంభించిన భద్రగిరి మార్ట్‌ లక్ష్యం, ఉత్పత్తులు, వాటి ఉపయోగాలు, ఆర్థిక చేయూత గురించి వివరించారు. అనంతరం వమాలి దికాకు మాట్లాడుతూ.. ఇలాంటి మార్ట్‌ల వల్ల గిరిజనులు ఆర్థికాభివృద్ధితో పాటు గిరిజన రైతులు, దళారుల దోపిడీకి గురి కాకుండా లాభపడతారన్నారు. మిగిలిన ఐటీడీఏల్లో కూడా ఇలాంటి గిరిజన మార్ట్‌లు ప్రారంభించి గిరిజన వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాలు కొనుగోలు చేసి చేయూత అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓలు, డీటీడీఓలు, ఇతర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement