పెద్దాస్పత్రిలో చికిత్సకు వచ్చిన వారి కష్టాలు
పలు విభాగాల్లో ఏసీలు పనిచేయక సమస్య
మండే ఎండలతో అల్లాడుతున్న ఇన్ పేషెంట్లు
178 ఏసీలు.. పనిచేసేవి 30 మాత్రమే
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి వేసవి కష్టాలు మొదలయ్యాయి. పలు విభాగాల్లో ఏసీలు పాతవి కావడం, ఇందులో చాలావరకు పనిచేయకపోగా.. ఎండవేడి, ఉక్కపోతతో ఇన్ పేషెంట్లు విలవిల్లాడిపోతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది మరింత పెరిగే అవకాశం ఉండడంతో అసలే ఆరోగ్యం బాగా లేక చికిత్స కోసం వచ్చేవారు మరింత ఇబ్బంది పడే ప్రమాదముంది.
అవార్డులతోనే సంతృప్తి
ఈనెల 7వ తేదీన జనరల్ ఆస్పత్రికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డు వరించింది. మెరుగైన వైద్యసేవలు, రోగులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు గాను ప్రకటించిన ఈ వార్డును రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా సూపరింటెండెంట్ నరేందర్ అందుకున్నారు. అవార్డు రావడం ఆనందమే అయినా క్షేత్రస్థాయిలో వసతుల కల్పనలో మాత్రం ఆ పరిస్థితులు లేవనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా ఆస్పత్రికి ఖమ్మం నుంచే భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబా ద్ జిల్లాల నుంచి చికిత్స కోసం వస్తుంటారు. హైదరాబాద్ తర్వాత ఎక్కువ సంఖ్యలో ఇక్కడే చికిత్స పొందుతున్నా.. ఎండాకాలంలో ఏసీలను మరమ్మతు చేయించకపోవడంపై పెదవి విరుస్తున్నారు. జనరల్ ఆస్పత్రితో పాటు మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పూర్తి స్ధాయిలో ఏసీలు లేక బాలింతలు, గర్బిణులు, చిన్నారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇందులో కొందరు సొంతంగా బ్యాటరీ ఫ్యాన్లు, టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకుని ఉపశమనం పొందుతున్నారు. భానుడు మరింత ప్రతాపం చూపకముందే పూర్తిస్థాయిలో ఏసీలను మరమ్మతు చేయించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఆస్పత్రిలో ఏసీల మరమ్మతు బాధ్యతలు కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాం. ఇప్పటికే ఎన్ని పని చేయడం లేదో గుర్తించారు. వారంలోగా అన్ని ఏసీలను పూర్తి స్థాయిలో మరమ్మతు చేయిస్తాం. ఆ తర్వాత ఏడాది పాటు బాధ్యతలు కాంట్రాక్టర్ చూసుకుంటారు.
– సంతోష్, ఏడీ, జనరల్ ఆస్పత్రి
పెద్దాస్పత్రిలోని పలు విభాగాల్లో 178 ఏసీలు ఉన్నాయి. ఇటీవల అధికారులు అన్నింటినీ తనిఖీ చేయించగా కేవలం 30 మాత్రమే పనిచేస్తున్నాయని తేలింది. ఆస్పత్రి వైద్యవిధాన పరిషత్ పరిధిలో ఉన్నప్పుడు ఏసీ నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కాంట్రాక్టు సంస్థ బాధ్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తే ఏసీలు పాడైతే మరమ్మతు చేసేవారు. ఆ వెంటనే బిల్లు సమర్పిస్తే నిధులు మంజూరయ్యేవి. కానీ జనరల్ ఆస్పత్రి రెండున్నరేళ్ల క్రితం డీఎమ్‌ఈ పరిధిలోకి వెళ్లాక అనేక ఏసీలు పాడైనా బడ్జెట్ లేకపోవడంతో మరమ్మతులు జరగలేదు. ఫలితంగా 30 మాత్రమే పనిచేస్తున్నాయని తేలడంతో అధికారులే నిర్ఘాంతపోయినట్లు తెలిసింది.


