పలువురు న్యాయమూర్తుల బదిలీ | - | Sakshi
Sakshi News home page

పలువురు న్యాయమూర్తుల బదిలీ

Apr 11 2026 8:22 AM | Updated on Apr 11 2026 8:22 AM

ఖమ్మం లీగల్‌: జిల్లా కోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఈమేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమేరకు ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.ఉమాదేవి మేడ్చల్‌ మల్కాజ్‌గిరి ఫ్యామిలీ కోర్టుకు, రెండో అదనపు జి ల్లా న్యాయాధికారి వెంపటి అపర్ణ హైదరాబాద్‌లోని 26వ అదనపు చీఫ్‌ జడ్జి, సిటీ సివిల్‌ కోర్టుకు, ఖమ్మం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి దేవినేని రాంప్రసాద్‌ కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టుకు బదిలీ అయ్యా రు. ఇకఖమ్మం కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి అర్చనాకుమారిని హైదరాబాద్‌ 12వ అదనపు సెషన్స్‌ జడ్జి(పోక్సో కోర్టు) కోర్టుకు బదిలీ చేశారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో 9వ అదనపు చీఫ్‌ జడ్జి బాకరాజు శ్రీనివాసరావును ఖమ్మం మొదటిఅదనపు జిల్లా న్యాయమూర్తిగా ని యమించారు. అలాగే, 18వ అదనపు చీఫ్‌ జడ్జి డాక్టర్‌ జీ.వీ.మహేష్‌నాథ్‌ను ఖమ్మం కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తిగా, సంగారెడ్డి మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్‌ పుల్లభట్ల పొగడ కృష్ణార్జున్‌ను ఖమ్మం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

నేడు, రేపు

మంత్రి తుమ్మల పర్యటన

ఖమ్మంఅర్బన్‌: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శని, ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఖమ్మం 36వ డివిజన్‌ ట్రంక్‌ రోడ్డులో జిల్లా సైన్స్‌ మ్యూజియాన్ని మంత్రి ప్రారంభిస్తారు. ఆతర్వాత 34వ డివిజన్‌లో సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఆదివారం ఉదయం ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్‌లోని పీఆర్‌టీయూ టీఎస్‌ కార్యాలయంలో సామినేని హిమవంతరావు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరిస్తారు.

గృహనిర్మాణాల్లో

వేగం పెరగాలి

కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి

ఖమ్మంగాంధీచౌక్‌: ఈ నెలాఖరుకు నాటికి జిల్లాలో 10వేల ఇందిరమ్మ ఇళ్లను గృహప్రవేశానికి సిద్ధం చేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సూచించారు. ఈమేరకు పనుల్లో వేగం పెరిగేలా నిత్యం పర్యవేక్షించాలని తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన ఎంపీడీఓలు, తహసీల్దార్లు, హౌజింగ్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 10వేల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా లబ్ధిదారులకు అధికారులు అండగా నిలవాలని తెలిపారు. ఇవికాక జిల్లాలో ఇంకా 1,912 నిర్మాణాలు మొదలుకాలేదని చెప్పారు. ఈమేరకు లబ్ధిదారులకు అవగాహన కల్పించి త్వరగా పనులు ప్రారంభించేలా చొరవ చూపాలని సూచించారు. కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి, హౌజింగ్‌ పీడీ భూక్యా శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఆధునిక విధానాలతో మత్స్యరంగం అభివృద్ధి

కూసుమంచి: చేపల పెంపకం, వేట జీవనాధారంగా ఉన్న మత్స్యకారులు ఆధునిక విధానాలను అందిపుచ్చుకోవాలని, తద్వారా మరింత లబ్ధి జరుగుతుందని నాబార్డు డీడీఎం ఎల్‌.సుజిత్‌కుమార్‌ సూచించారు. పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో బయోప్లాక్‌ విధానంలో చేపల పెంపకంపై ఇస్తున్న శిక్షణ శుక్రవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా డీడీఎం మాట్లాడుతూ నాబార్డు ఆధ్వర్యాన మత్స్యరంగం అభివృద్ధికి అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను అమలుచేస్తే చేపల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ శ్యాంప్రసాద్‌, శాస్త్రవేత్తలు రవీందర్‌, శాంతన్న, నాగరాజు మాట్లాడగా ఆత్మ బ్లాక్‌ టెక్నాలజీ మేనేజర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

రేక్‌ పాయింట్‌కు 3,017 మె.టన్నుల యూరియా

చింతకాని: చింతకాని మండలంలోని పందిళ్లపల్లి రేక్‌ పాయింట్‌కు శుక్రవారం ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కంపెనీకి చెందిన 3,017.16 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇందులో ఖమ్మం జిల్లాకు 757.16 మె.టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 1,130 మె.టన్నులు, మహబూబాబాద్‌ జిల్లాకు 630 మె. టన్నులు సరఫరా చేసినట్లు వెల్లడించారు. మిగతా 500 మెట్రిక్‌ టన్నుల యూరియాను బఫర్‌ స్టాక్‌గా నిల్వ చేశామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement