ఆర్థికంగా అనుకూలించకున్నా పథకాల అమలు
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నేలకొండపల్లి: ఆర్థిక పరిస్థితులు సహకరించకున్నా పేదల సంక్షేమం విషయంలో రాజీ పడడం లేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలోని గురుకుల పాఠశాలలో రూ.34 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాక వంటలు, కూరగాయలను పరిశీలించి మెనూ అమలుపై విద్యార్థినులతో మాట్లాడారు. అలాగే, వివిధ గ్రామాల్లో పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి, 132 మందికి రూ.45.66 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజల దీవెనలతో ఏర్పడిన తమ ప్రభుత్వం పేదల వైద్యానికి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూనే వారి సంక్షేమానికి అనేక పథకాలు అమలుచేస్తోందని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత ప్రయాణం, నూతన రేషన్‌కార్డులు, సన్న బియ్యం పంపిణీ, రూ.500 గ్యాస్ సిలిండర్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పేదలకు అందగా నిలుస్తున్నామని చెప్పారు. కాగా, ఏప్రిల్ నెలాఖరు లేదా మే మెదటి వారంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉంటుందని మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వకపోగా.. తాము అధికారంలోకి రాగానే ఇళ్ల మంజూరుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఆర్‌డీఓ శ్రీనివాస్, ప్రత్యేక అధికారి రమేష్, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు కొడాలి గోవిందరావు, జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు, రాయపూడి నవీన్, ఎం.వెంకన్న, బొందయ్య, భద్రయ్య, నంబూరి రామారావు, పసుపులేటి శ్రీలత, జెర్రిపోతుల సత్యనారాయణ, పెంటమళ్ల పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు శ్రీశ్రీ సర్కిల్‌లో నిర్వహించే జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఆతర్వాత ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి ఆటోనగర్ వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాక కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. అలాగే సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేస్తారు. అనంతరం ఖమ్మంరూరల్ మండలం మంగళగూడెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి, సాయంత్రం తిరుమలాయపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు.


