● ప్రారంభమైన భద్రాచల రామాలయ అభివృద్ధి పనులు ● నైవేద్య వంటశాలకు తాత్కాలిక షెడ్ నిర్మాణం.. ● మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయి పనులు షురూ..
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. గత నెల 27న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం విదితమే. 2027 మార్చి నాటికి పనులను పూర్తి చేసి అప్పగించాలని ఆదేశాలను జారీ చేశారు. సమయం తక్కువగా ఉండటంతోపాటు గోదావరి పుష్కరాలు–2027 సైతం సమీపిస్తుండటంతో అభివృద్ధి పనుల ప్రక్రియ వేగవంతమైంది. తొలుత ఆలయంలోని మొదటి ప్రాకారం నిర్మించేందుకు, ఉపాలయాల తొలగింపునకు ప్రణాళికలు రచించారు. స్వామివారికి నివేదనను తయారు చేసే వంటశాల షెడ్‌ను తాత్కాలికంగా కొబ్బరికాయలు కొట్టే ప్రదేశంలో శబరి విగ్రహం ఉన్న స్థలంలో నిర్మించనుండగా, శుక్రవారం పనులు ప్రారంభించారు. లడ్డూల తయారీ కేంద్రాన్ని సీఆర్వో కార్యాలయం పైభాగాన తానీషా కల్యాణ మండపానికి తరలించనున్నారు. ఇక చిత్రకూట మండపం, భద్ర మహర్షి ఆలయాన్ని సైతం తొలగించనున్నారు.
26న మూర్తులకు పూజలు
ఆలయ విస్తరణలో ఉపాలయాల తొలగింపు కీలకంగా మారింది. ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు, ఆళ్వార్‌ల మూర్తులను తొలగించనున్నారు. లక్ష్మీతాయారు అమ్మవారి మూలమూర్తులను అంతరాలయంలో ఉంచి పూజలను జరపనున్నారు. ఆళ్వార్‌లు, చిత్ర కూట మండపంలో ఉన్న స్వర్ణ పూత వాహనాలను, మూ ర్తులను రంగనాయకుల గుట్టపైన ఉన్న ధ్యానమందిరానికి తరలించనున్నారు. ఈ నెల 25 నాటికి పనులన్నీ పూర్తి చేసి 26న అమ్మవారు, ఆళ్వార్ల మూర్తులకు పూజలు చేసి, కదిలించనున్నారు.
భవనాల తొలగింపునకు టెండర్లు
ఆలయ అభివృద్ధికి రూ.586 కోట్లను ప్రకటించగా, తొలి విడతగా రూ.351 కోట్లతో మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో మూడు భాగాలుగా పనులు విభజించారు. రూ. 75 కోట్లతో గోదావరి ఘాట్లు, రూ.180కోట్లతో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, రూ. 96 కోట్లతో ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధి చేపట్టనున్నారు. పనుల బాధ్యత అప్పగించిన ఆర్‌అండ్‌బీ శాఖ ఏక కాలంలో మూడింటి పనులను ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలు స్తోంది. తొలుత ఉపాలయాలు, చిత్రకూట మండ పం, ఇతర భవనాల తొలగింపునకు సుమారు రూ. 4కోట్లతో టెండర్లు ఖరారు చేసే అవకాశం ఉంది. మే మొదటి వారంలో పనులు ప్రారంభించేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. రామాలయ అభివృద్ధి పనుల ప్రక్రియ వేగవంతం కావడంతో స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


