నేలకొండపల్లి/ముదిగొండ: జిల్లాలో ఉపాధి హమీ పథకం పనులకు వచ్చే కూలీల సంఖ్య మరింత పెంచేలా ఉద్యోగులు కృషి చేయాలని డీఆర్‌డీఓ కొండపల్లి శ్రీరామ్ సూచించారు. నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారం, ముదిగొండ మండలంలోని కట్టకూరులో శుక్రవారం ఆయన నర్సరీలు, ఉపాధి హమీ పథకం పనులను పరిశీలించారు. మస్టర్లు తనిఖీ చేయడమే కాక కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేశారు. అనంతరం డీఆర్‌డీఓ మాట్లాడుతూ జిల్లాలో ప్రతీరోజు 12 వేల మంది కూలీలు పనులకు వస్తుండగా.. ఈ సంఖ్య మరింత పెరిగేలా చూడడంతో పాటు ఉదయం 6–30 గంటలకే ప్రారంభించాలని సూచించారు. అలాగే, హాజరు నమోదు, ఎండ బారిన పడకుండా సౌకర్యాల కల్పనపై సూచనలు చేశారు. అలాగే, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, ఇప్పటివరకు 85 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎంపీడీఓ బండి భాస్కర్‌రావు, సర్పంచ్ యల్ల య్య, ఏపీఓలు ఆర్.సునీత, రమ, ఈసీ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.


