ఎర్ర బంగారం కళకళ | - | Sakshi
Sakshi News home page

ఎర్ర బంగారం కళకళ

Apr 11 2026 8:22 AM | Updated on Apr 11 2026 8:22 AM

● ‘తేజా’ రకం క్వింటాకు రూ.20 వేలు దాటిన ధర ● దిగుబడి తగ్గిన వేళ పెరుగుతున్న డిమాండ్‌

ధర బాగానే వచ్చింది..

ధర ఉంది.. దిగుబడే లేదు

● ‘తేజా’ రకం క్వింటాకు రూ.20 వేలు దాటిన ధర ● దిగుబడి తగ్గిన వేళ పెరుగుతున్న డిమాండ్‌

ఖమ్మంవ్యవసాయం: తేజా రకం మిర్చి ధర కొద్దికొద్దిగా పెరుగుతోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం ఈ రకం మిర్చి క్వింటాకు జెండాపాట రూ.20,100గా పలికింది. పంట సీజన్‌ ఆరంభంతో పోలిస్తే రూ.5 వేల వరకు పెరిగినట్లయింది. ఈ ఏడాది సాగు చేసిన మిర్చి పంట ఉత్పత్తి నవంబర్‌లో మొదలుకాగా తొలినాళ్లలో గరిష్టంగా రూ.15 వేలు ధర పలికింది. సంక్రాంతి వరకు అదే పరిస్థితి ఉండగా.. జనవరి 20న రూ.17,600కు చేరింది. ఇక జనవరి 20 నుంచి 23వరకు మాత్రం రూ.20 వేల నుంచి 21,150 వరకు ధర పలికింది. మళ్లీ ఫిబ్రవరిలో రూ.18 వేలకు పడిపోయినా మార్చి నుంచి క్రమంగా పెరుగుతోంది. గురువారం రూ.19,800గా పలికిన ధర శుక్రవారం రూ.20,100కు చేరడం విశేషం. అంతేకాకుండా మరింత నాణ్యత కలిగిన కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ మిర్చి ధర రూ.20,500గా పలికింది. కాగా, మార్కెట్‌కు ప్రతిరోజూ సగటున 35 వేలనుంచి 40 వేల బస్తాలకు పైగా మిర్చి తీసుకొస్తున్నారు.

సాగు, దిగుబడి తగ్గడంతో..

మిర్చి పంట సాగు విస్తీర్ణం జిల్లాలో గణనీయంగా తగ్గింది. సాధారణంగా లక్ష ఎకరాల్లో సాగయ్యే మిర్చి గత ఏడాది 60 వేల ఎకరాలకు, ఈసారి 30 వేల ఎకరాలకు పడిపోయింది. గతంలో ఎదురైన నష్టాలతో రైతులు సాగు తగ్గించారు. అంతేకాక అధిక వర్షాలు, నల్లి కారణంగా దిగుబడులు కూడా రాలేదు. సాధారణంగా ఎకరాకు 30 – 40 క్వింటాళ్లు వచ్చే దిగుబడి ఈ ఏడాది 15 క్వింటాళ్లు దాటలేదు. అయితే, ఈ ఏడాది ఆరంభం నుంచి మిర్చి విదేశీ ఆర్డర్లు లేకున్నా దేశీయంగా డిమాండ్‌ పలుకుతోంది. ఇక్కడ కొనుగోలు చేసే తేజా రకం మిర్చిని కోల్‌కత్తా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం చైనాకు కూడా పంపిస్తున్నారు. మరికొందరు వ్యాపారులు రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేస్తున్నారు. ఇలా రకారకాల కారణాలతో గత ఏడాది ధరతో పోలిస్తే ఈసారి ఽమిర్చి ధర ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

మిర్చి ధర కొంత మేరకు ఆశాజనకంగా ఉంది. నేను ఆరు ఎకరాల్లో పంట సాగు చేశా. ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. 50 బస్తాల మిర్చిని ఖమ్మం తీసుకొస్తే క్వింటాకు రూ.20 వేల ధర పలికింది.

–బానోత్‌ కిషన్‌, నల్లెల్ల, మహబూబాబాద్‌ జిల్లా

మూడెకరాల్లో మిర్చి సాగు చేశా. ఎకరాకు 25 క్వింటాళ్లు వచ్చే దిగుబడి 15 క్వింటాళ్లుదాటలేదు. అధిక వర్షాలు, నల్లితో ఈ పరిస్థితి ఉంది. 30 బస్తాల మిర్చి తీసుకొస్తే కొంత తేమ ఉండడంతో ధర రూ.19 వేలుగా నిర్ణయించారు.

–జి.రవి, గేటు కారేపల్లి, ఖమ్మం జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement