కూసుమంచి: మండలంలోని హట్యాతండా సమీపాన సాగర్ ఐట్ ఫ్లో కెనాల్‌లోకి శుక్రవారం ట్రాక్టర్ దూసుకెళ్లింది. రైతు బదావత్ శ్రీను తన ట్రాక్టర్‌తో పొలానికి వెళ్తుండగా అదుపు తప్పడంతో ఈ ఘటన జరిగింది. ఇంజిన్ ముందు భాగం నీటిలో మునగగా శ్రీను బయటకు వచ్చి ఈదుతూ ఒడ్డుకు చేరాడు. అనంతరం జేసీబీ సాయంతో ట్రాక్టర్‌ను బయటకు తీశారు.
అదుపు తప్పి కారు బోల్తా
రఘునాథపాలెం: మండలంలోని మంచుకొండ – బూడిదంపాడు మార్గంలో మూలమలుపు చెరువు వద్ద శుక్రవారం కారు అదుపుతప్పి బోల్తా పడింది. అయితే, కారు పూర్తిగా ధ్వంసమైనా అందులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఖమ్మంకు చెందిన ఇద్దరు డ్రైవర్‌తో కలిసి గురువారం ఇల్లెందు వెళ్లి శుక్రవారం తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. ఘటనపై బాదితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.
డీలర్‌పై కేసు నమోదు
ఖమ్మం సహకారనగర్/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులోని ఓ రేషన్ దుకాణంలో శుక్రవారం జిల్లా పౌరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ నేతృత్వాన తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా షాప్‌లో 43.68 క్వింటాళ్ల సన్నబియ్యం తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేసినట్లు డీసీఎస్‌ఓ తెలిపారు. తనిఖీల్లో ఖమ్మం రూరల్ డీటీ విజయబాబు, సిబ్బంది పాల్గొన్నారు.


