ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో మందులు ఇచ్చే గదికి తాళం పడింది. దీంతో మూడు రోజులుగా మందుల పంపిణీ నిలిచిపోగా ఆస్పత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నిత్యం ఎంసీహెచ్‌లో 400 – 600 మంది వస్తుంటారు. అయితే ఇక్కడ మందులు ఇచ్చే ఫార్మసిస్ట్ వైద్య విధాన పరిషత్ ఉద్యోగి అయినా పెద్దాస్పత్రిలో అవసరమై అధికారులు డీఎంఈ వైపు పంపించారు. కానీ, ఇటీవల వెనక్కి పిలిపించడంతో ఫార్మసిస్ట్ లేక గదికి తాళం వేశారు. ఈ క్రమాన జనరల్ ఆస్పత్రి ఫార్మసీలో మందులు తీసుకోవాలని సూచిస్తుండడంతో పరీక్షల అనంతరం ఎంసీహెచ్ నుంచి అక్కడకు వెళ్లాల్సి వస్తోంది. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ నరేందర్‌ను వివరణ కోరగా ఫార్మసిస్ట్ వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని తెలిపారు. ప్రస్తుతం జనరల్ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌లు సరిపడా లేక ఎంసీహెచ్‌లో సర్దుబాటు చేయలేకపోతున్నామని, త్వరలోనే ప్రత్యామ్నాయం చూస్తామని వెల్లడించారు.


