పౌరసరఫరాల సంస్థ డీఎం శ్రీలత బదిలీ | - | Sakshi
Sakshi News home page

పౌరసరఫరాల సంస్థ డీఎం శ్రీలత బదిలీ

Apr 10 2026 10:03 AM | Updated on Apr 10 2026 10:03 AM

ఖమ్మం సహకారనగర్‌: రాష్ట్రంలో పది మంది స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న గంటా శ్రీలతకు స్థానచలనం కలిగింది. ఆమెను హైదరాబాద్‌లో రెరా(రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులరేటరీ అథారిటీ)కి డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు. అయితే, జిల్లాలో డీఎంగా మాత్రం ఎవరికీ పోస్టింగ్‌ ఇవ్వలేదు.

హెచ్‌ఎంపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని విద్యార్థినుల ఆందోళన

కామేపల్లి: కామేపల్లి ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం బి.నెహ్రూపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని విద్యార్థినులు కోరారు. ఈమేరకు పాఠశాల ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. ఓ ఉపాధ్యాయురాలి తప్పుడు ఫిర్యాదుతో అధికారులు సస్పెండ్‌ చేసినందున, ఆమైపె చర్యలు తీసుకోవాలని చేపట్టిన నిరసన మూడు గంటల పాటు కొనసాగింది. దీంతో ఐటీడీఏ ఏటీడీఓలు రమేష్‌, సత్యవతి, సీఐ సాగర్‌, ఎస్సై శ్రీకాంత్‌ చేరుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. కాగా, బాలికలతో హెచ్‌ఎం అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసి బాలికల మనస్తాపానికి కారణమైన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ అజ్మీరా బుల్లి, స్థానికులు డిమాండ్‌ చేశారు. ధర్నా సమయాన ఎండతో ఓ విద్యార్థిని సొమ్మసిల్లి పడిపోగా పీహెచ్‌సీలో చికిత్స చేయించారు.

11న ఉమ్మడి జిల్లాస్థాయి క్రికెట్‌ ఎంపికలు

ఖమ్మం స్పోర్ట్స్‌: ఉమ్మడి జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపిక పోటీలు ఈనెల 11న నిర్వహిస్తున్నట్లు క్రికెట్‌ అసోసియేషన్‌ ఖమ్మం జిల్లా కార్యదర్శి సీహెచ్‌.వెంకట్‌, కోఆర్డినేటర్‌ ఎం.డీ.మసూద్‌ తెలిపారు. ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఈ పోటీలు ఉంటాయని వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రికెటర్లు వయసు ధ్రువీకరణపత్రాలతో ఉదయం 10 గంటలకు రిపోర్ట్‌ చేయాలని, వివరాలకు 79818 81095 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

30వ తేదీ వరకు

బియ్యం పంపిణీ

ఖమ్మం సహకారనగర్‌: ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల రేషన్‌ బియ్యం పంపిణీ ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని డీసీఎస్‌ఓ చందన్‌కుమార్‌ తెలిపారు. ఈమేరకు లబ్ధిదారులు ఈ–కేవైసీ చేయించుకొని బియ్యం తీసుకోవాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.

డీలర్‌పై కేసు నమోదు..

వేంసూరు మండలం దుద్దేపుడికి చెందిన రేషన్‌ డీలర్‌పై 6ఏ కేసు నమోదైంది. రేషన్‌ దుకాణాన్ని ఖమ్మం రూరల్‌ డీటీ విజయబాబు గురువారం తనిఖీ చేయగా 20.77క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉండడంతో డీలర్‌పై కేసు నమోదు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్‌ తెలిపారు.

పాడి గేదెల పథకం దరఖాస్తు గడువు పొడిగింపు

ఖమ్మంమయూరిసెంటర్‌: ఎస్సీ యాక్షన్‌ ప్లాన్‌ ద్వారా రెండేసి పాడి గేదెల పంపిణీ పథకం దరఖాస్తు గడువును ఈనెల 16 వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ ఈడీ నవీన్‌బాబు తెలిపారు. ఈమేరకు ఇంటర్నెట్‌, మీ సేవ కేంద్రాల్లో tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని దాని ప్రతికి అన్ని పత్రాలు జత చేసి మున్సిపల్‌, మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఈనెల 16 లోపు అందజేయాలని సూచించారు. గడువులోగా అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.

వ్యాక్సిన్‌తో గాలికుంటు వ్యాధి నివారణ

సత్తుపల్లిరూరల్‌: పశువులకు టీకా వేయించడం ద్వారా గాలికుంటు వ్యాధి సోకకుండా కాపాడుకోవచ్చని జిల్లా పశువైద్యాధికారి పురందర్‌ తెలిపారు. సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వ్యాక్సిన్‌ శిబిరాలను గురువారం పరిశీలించిన ఆయన రైతులకు అవగాహన కల్పించారు. పశువులకు టీకా వేయించకపోతే గాలికుంటు వ్యాధి సోకి పాల ఉత్పత్తి, పునరుత్పత్తి తగ్గుతుందని తెలిపారు. వైద్యులు కె.ప్రదీప్‌, ఎస్‌.కే.సఫియా, సీహెచ్‌.శశిదీప్‌, కె.రాజశేఖర్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement