ఎరువు.. మరింత బరువు | - | Sakshi
Sakshi News home page

ఎరువు.. మరింత బరువు

Apr 10 2026 10:03 AM | Updated on Apr 10 2026 10:03 AM

కాంప్లెక్స్‌ ఎరువు రూ.300 మేర ధర పెంపు రూ.125 పెరిగిన పొటాష్‌ ధర డీఎపీ, సూపర్‌ పాస్పేట్‌ మాత్రం యథాతథం

ఖమ్మంవ్యవసాయం: ఎరువుల ధరలకు రెక్కలొచ్చాయి. ఆశించిన స్థాయిలో పంటల దిగుబడి రాకపోవడం.. ఆపై మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఇబ్బంది పడుతుండగా.. ఇప్పుడు ఎరువుల ధరలు పెరగడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన వానాకాలం నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు ఎరువుల ధరలు పెరగడం గమనార్హం.

అమల్లోకి కొత్త ధరలు

పెరిగిన ఎరువుల ధరలు ఈనెల నుంచి అమల్లోకి వచ్చాయి. గడిచిన యాసంగి సీజన్‌తో పోలిస్తే కాంప్లెక్స్‌ ఎరువుల ధర రూ.300 మేర పెరిగింది. అలాగే, మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ధర రూ.125 పెరిగింది. గడిచిన వానాకాలంతో పరిశీలిస్తే ఎరువుల ధర రూ. 600, పొటాష్‌ ధర రూ. 275 మేర పెరగడం గమనార్హం. ఇక డీఏపీ(డై అమోనియా పాస్పేట్‌), సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌(ఎస్‌ఎస్‌పీ) ధరలు యథాతథంగా ఉండగా, ప్రభుత్వం సబ్సిడీపై అందించే యూరియా ధరలో మాత్రం మార్పు చేయలేదు.

2 లక్షల మె.టన్నుల వినియోగం

అధిక దిగుబడి, పంటల నాణ్యత కోసం రైతులు కాంప్లెక్స్‌, డీఏపీ, మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వంటి ఎరువులను వినియోగిస్తారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 11 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఈ పంటల్లో ఒక్కో సీజన్‌కు దాదాపు 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు వినియోగిస్తారని అంచనా. ఇందులో 65వేల మెట్రిక్‌ టన్నుల యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులు మరో 65 వేల మెట్రిక్‌ టన్నులు, పొటాష్‌ 15వేల మెట్రిక్‌ టన్నులు, డీఏపీ, సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌ వంటి ఎరువులు 55 వేల మెట్రిక్‌ టన్నుల మేర ఉంటాయి. ఎరువులను సబ్సిడీపై పంపిణీ చేస్తుండడంతో రైతులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. కానీ ఏడాదిగా యూరియా కొరతతో ప్రభుత్వం సరఫరా తగ్గించగా, ఆ స్థానంలో కాంప్లెక్స్‌ ఎరువులు వినియోగిస్తున్నారు.

ముడి పదార్థాల ధరలు పెరగడంతోనే..

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి పదార్థాల ధరలు పెరగడం ఎరువుల ధరలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా సహజ వాయువు సరఫరా నిలిచిపోవటం, రవాణా చార్జీలు పెరగటానికి తోడు డాలర్‌తో రూపాయి విలువ తగ్గడం కూడా కారణాలుగా చెబుతున్నారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత ప్రస్తుతం ఇరాన్‌ – ఇజ్రాయిల్‌ యుద్ధంతో ఈ పరిస్థితి ఏర్పడిందని, మున్ముందు ఎరువుల ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాల ద్వారా తెలుస్తోంది. ధరల పెంపునకు తోడు కొరత ఏర్పడుతుందనే భావనతో కొందరు రైతులు రానున్న వానాకాలం సీజన్‌ కోసం పలు రకాల కాంప్లెక్స్‌, డీఏపీ, పొటాష్‌ ఎరువులను నిల్వ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇదే అదునుగా ఎరువుల వ్యాపారులు పాత నిల్వలను కూడా కొత్త ధరలతో విక్రయిస్తున్నారని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement