బోనకల్: మండలంలోని పెద్దబీరవల్లి గ్రామ మలుపు సమీపాన గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ చక్రపాణి(35) మృతి చెందాడు. ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన రామంజనేయ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన ఫ్లైయాష్ ట్యాంకర్ కొత్తగూడెం నుంచి జగ్గయ్యపేట వైపు వెళ్తోంది. ఈమేరకు తెల్ల వారుజామున పెద్దబీరవల్లి మలుపు వద్ద వాహనం అతివేగంగా కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈక్రమాన ట్యాంకర్ క్యాబిన్ భాగం డ్రైవర్ చక్రపాణిపై పడడంతో తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు చేరుకుని మృతదేహాన్ని బయటకుతీశాక, ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పొదిలి వెంకన్న తెలిపారు.
నగదు, నగలతో పాటు సిలిండర్ చోరీ!
వంటనూనె కూడా ఎత్తుకెళ్లిన దుండగులు
పెనుబల్లి: సహజంగా చోరీకి వచ్చిన వారు నగలు, నగదుతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. అయితే, ఇవి కాకుండా వంటనూనె, గ్యాస్ సిలిండర్ కూడా చోరీ చేసిన ఘటన ఇది. జార్ఖండ్ నుంచి ఏళ్ల క్రితం పెనుబల్లి మండలం లంకపల్లికి వచ్చిన మహమ్మద్ కమాలుద్దీన్ మసీదులో మౌల్వీగా పనిచేస్తూ లంకపల్లి సెంటర్‌లో ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తున్నాడు. ఈక్రమాన గురువారం ఉదయం ఆయన ఇంటికి తాళం వేసి భార్యతో పాటు షాపునకు వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం వచ్చే సరికి ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఈమేరకు పరిశీలించగా బీరువాలోని రూ.10వేల నగదు, 5.195 గ్రాముల బంగారు, 454,74 గ్రాములు వెండి ఆభరణాల చోరీ జరిగినట్లు తేలింది. ఆపై వంట గదిలో చూస్తే 15 లీటర్ల వంట నూనె, గ్యాస్ సిలిండర్ కూడా లేకపోవడంతో అవి కూడా దుండగులు ఎత్తుకెళ్లి ఉంటారనే నిర్ధారణకు వచ్చారు. ఘటనపై కమాలుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదుతో వీ.ఎం.బంజరు పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
మహిళా కూలీలకు గాయాలు
వేంసూరు: వేంసూరు మండలం కందుకూరులో ట్రాక్టర్ ట్రక్కు బోల్తా కొట్టగా నలుగురు మహిళ కూలీలకు స్వల గాయాలయ్యాయి. కందుకూరుకు చెందిన 10 మంది మహిళా కూలీలు గురువారం ట్రాక్టర్‌లో నువ్వుల కట్టె లోడ్ చేసి అదే లోడ్‌పై కూర్చుని వెళ్తున్నారు. ఈమేరకు పొలాల్లో ఎగుడుదిగుడుగా ఉన్న చోట ట్రాక్టర్ ట్రక్కు పల్టీ కొట్టింది. ఘటనలో నలుగురు కూలీలకు గాయాలు కాగా సత్తుపల్లి ఆస్పత్రికి తరలించారు.


