బ్లాక్‌స్పాట్ల వద్ద రక్షణ చర్యలపై దృష్టి సారించని శాఖలు గత మూడు నెలల్లో 85మంది మృత్యువాత
వేగంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..
ఆ మూడు ప్రాంతాల్లో...
ఇటీవల కొణిజర్ల వద్ద ప్రమాదంలో దెబ్బతిన్నలారీ, కారు
రక్తమోడుతున్న రహదారులు
ప్రతిరోజూ జిల్లాలో ఎక్కడో ఓ చోట జరుగుతున్న ప్రమాదాలు ప్రజలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అతి వేగంగా వెళ్లే వాహనదారులు ప్రమాదాల బారిన పడడమే కాక మిగతా వారికీ సమస్యలు తెచ్చిపెడుతున్నారు. గత సోమవారం కొణిజర్లలో జరిగిన ప్రమాదానికి లారీ డ్రైవర్ అతివేగమే కారణమని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనలో కారు, లారీ ముందుభాగాలు నుజ్జునుజ్జ కాగా, వాహనాలు నడుపుతున్న వారు అందులో ఇరుక్కుపోయారు. వీరిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించడానికి చాలా సమయం పట్టింది. ఇక కొందరు భారీ వాహనాల డ్రైవర్లు రాత్రి సమయాన్నే ప్రయాణానికి ఎంచుకుని మద్యం మత్తులో తూలుతున్నారని తెలుస్తోంది. అంతేకాక రోడ్డు నిబంధనలను కూడా పాటించక ప్రమాదాలకు కారణమవుతున్నారు.
పట్టింపు ఏదీ?
తరచూ రోడ్డు ప్రమాదాల కట్టడి, నష్టనివారణ చర్యలపై పోలీసు, రవాణా శాఖ తీసుకుంటున్న చర్యలు నామమాత్రమేనని చెప్పాలి. రాత్రి పూట వాహనాలు తనిఖీ చేయకపోవడం, స్పీడ్‌గన్లు ఉపయోగించకపోవడం, మద్యం మత్తులో వాహనాలను నడిపే వారిని గుర్తించడానికి కొన్ని స్టేషన్లలో బ్రీత్ ఎనలైజర్లు లేకపోవడం గమనార్హం. ఇక సామర్థ్యానికి మించి లోడ్, అతివేగంగా వెళ్లే వాహనాల గుర్తింపునకు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టిన దాఖలాలే లేవని చెప్పాలి. కేవలం రోడ్డు భద్రతా వారోత్సవాల సమయంలో అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి చేతులు దులుపుకోవడం తప్ప ఇతర సమయాన సదస్సులు, తనిఖీలు శూన్యమేనన్న విమర్శలు వస్తున్నాయి. ఇక ఆర్ అండ్ బీ శాఖ తరఫున ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సరైన సూచికబోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.
85మంది మృత్యువాత
ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 85మంది మృత్యువాత పడ్డారు. ఇక 250మందికి పైగా క్షతగాత్రులుగా మిగిలారు. ఇక రికార్డులకు ఎక్కని ప్రమాదాలు ఎన్ని ఉన్నాయో తెలియడం లేదు. అయితే, ఇందులో ఎక్కువ ప్రమాదాలకు అతివేగమే కారణమని మాత్రం చెబుతున్నారు. అంతేకాక మృతుల్లో ఎక్కువగా యువత ఉండడం కుటుంబాలకు వేదనను మిగులుస్తోంది. మరోపక్క జిల్లా మీదుగా సాగే గ్రీన్‌ఫీల్డ్ హైవేపైకి వైరా వద్ద ప్రవేశానికి అనుమతించారు. దీంతో వైరా, తల్లాడ, సత్తుపల్లి ప్రాంతాల్లో ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నా హైవేపై పెట్రోలింగ్ పెంచకపోతే ముప్పు పొంచి ఉన్నట్లే భావించాలి.
వాహనాల అతివేగం, ఓవర్‌లోడ్‌తో ప్రమాదాలు
జిల్లాలో జరుగుతున్న ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగే ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. అయితే, కారణాలు ఏమిటన్నది పక్కన పెడితే వరుస ప్రమాదాల్లో పలువురి ప్రాణాలు గాలిలో కలుస్తుండడం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. ఇదే సమయాన వందల సంఖ్యలో వాహనదారులు క్షతగాత్రులుగా మిగులుతున్నారు. – ఖమ్మంక్రైం
చాలావరకు ప్రమాదాల్లో వాహనదారుల అతివేగమే కారణమని తెలుస్తోంది. ఇంకొన్ని సందర్భాల్లో నిబంధనలు పాటించకపోవడం, మద్యం మత్తుతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటి కట్టడికి పోలీసు శాఖతో సమన్వయంతో కృషి చేస్తున్నాం. ప్రధానంగా ఓవర్ లోడ్, వేగ నియంత్రణకు తనిఖీలు ముమ్మరం చేస్తాం.
– శ్రీనివాసరావు, ఇన్‌చార్జ్ ఆర్‌టీఓ
జిల్లాలో ప్రధానంగా మూడుచోట్ల అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. తనికెళ్ల – కొణిజర్ల ప్రాంతంతో పాటు వైరా, తల్లాడ మండలాల్లో రోడ్డు ప్రమాదాలు గణనీయమైన సంఖ్యలో నమోదవుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు సైతం ఆయా ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్లు అధికంగానే ఉన్నాయని గుర్తించారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, పశ్చిమ బెంగాల్ నుండి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలను డ్రైవర్లు అతివేగంగా నడపడం, మద్యం మత్తులో ఉండడం.. తరచుగా అనుభవం లేని క్లీనర్లకు స్టీరింగ్ ఇస్తుండడం ప్రమాదాలకు ఓ కారణంగా తెలుస్తోంది. మిగతా ప్రాంతాల్లోనూ వాహనదారుల అతివేగంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.


