ప్రశ్నించే గొంతుల అణచివేతే కేంద్రం లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నించే గొంతుల అణచివేతే కేంద్రం లక్ష్యం

Apr 9 2026 7:29 AM | Updated on Apr 9 2026 7:29 AM

● అకస్మాత్తుగా నోటీసుల వెనుక రాజకీయ కుట్ర ● సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి రంగారావు

● అకస్మాత్తుగా నోటీసుల వెనుక రాజకీయ కుట్ర ● సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి రంగారావు

ఖమ్మంమయూరిసెంటర్‌: ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వారిని అక్రమ కేసులతో వేధించడం ఫాసిజమేనని, ఎన్‌ఐఏ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు స్పష్టం చేశారు. ఖమ్మంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాభై ఏళ్లుగా ప్రజా సమస్యలు, హక్కుల కోసం పోరాడుతున్న తనపై పాత కేసులన్నీ 2026 మార్చి నాటికే కోర్టులు కొట్టివేశాయని తెలిపారు. అయినా అకస్మాత్తుగా ఎన్‌ఐఏ నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. 2025 నవంబర్‌లో నమోదైన ఓ కేసులో విచారణకు రావాలంటూ నోటీసులు పంపడాన్ని ఆయన తప్పుబట్టారు. సుప్రీంకోర్టు తీర్పులు, ప్రభుత్వ విధానాలను ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించడం పౌరుల ప్రాథమిక హక్కు అని, గాదె ఇన్నయ్య అరెస్టును ఖండించినందుకే తనపై కేసు పెట్టడం హాస్యాస్పదమని అన్నారు.

ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధం..

మాస్‌లైన్‌ పార్టీ కేంద్ర కమిటీ నాయకులు కేజీ.రామచందర్‌, కె.రమ, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఎన్‌ఐఏ ద్వారా విచారణ పేరుతో వేధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోటు రంగారావు విచారణకు సిద్ధమేనని చెబుతూ... విచారణ పేరుతో కేసుల నమోదు చేయడం మాత్రం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. మాస్‌లైన్‌ నాయకులు ఎస్‌.ఎల్‌.పద్మ, కె.సూర్యం, సదానందం, ఎం. కృష్ణారెడ్డి, గుర్రం అచ్చయ్య, సీ.వై.పుల్లయ్య, జి.రామయ్య, ఆవుల అశోక్‌, మలీదు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే, పోటు రంగారావుకు నోటీసులు ఇవ్వడాన్ని సీపీఎం జిల్లా కమిటీ తరఫున ఖండిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. పేదల హక్కుల కోసం పోరాడుతున్న నాయకులపై దేశద్రోహం తరహా కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement