బాల్య వివాహాల కట్టడికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాల కట్టడికి చర్యలు

Apr 9 2026 7:29 AM | Updated on Apr 9 2026 7:29 AM

రఘునాథపాలెం: బాల్య వివాహాల నివారణకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్‌పర్సన్‌ సీతా దయాకర్‌రెడ్డి సూచించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రఘునాథపాలెం రైతు వేదికలో బుధవారం జిల్లా సంక్షేమాధికారి వేల్పుల విజేత అధ్యక్షతన సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, ఆంగన్‌వాడీ సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ, బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, విద్యా హక్కుపై చర్చించాక సీతా దయాకర్‌రెడ్డి మాట్లాడారు. గ్రామస్థాయిలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీలు చురుగ్గా పనిచేస్తూ బాలల సమస్యల పరిష్కారానికి పాలుపడాలని తెలిపారు. కాగా, పిల్లల భద్రతలో జిల్లా యంత్రాంగం కృషిని ఆమె అభినందించారు. జిల్లా సంక్షేమాధికారి విజేత మాట్లాడుతూ రఘునాథపాలెం మండలాన్ని బాల్య వివాహ రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. డీపీఓ రాంబాబు, డీఎంహెచ్‌ఓ రామారావు, బాలల హక్కుల కమిటీ సభ్యులు చందన, సరిత మాట్లాడగా ఎంపీడీఓ అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం రాపర్తినగర్‌/ఖమ్మం రూరల్‌: జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనను అందరూ బాధ్యతగా భావించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు చందన, సరిత సూచించారు. ఖమ్మం ఎన్సెస్పీ గెస్ట్‌హౌస్‌లో ఆమె మాట్లాడుతూ సర్పంచ్‌లు వారి గ్రామాల్లో ఆడపిల్లల సంఖ్య, బడికి ఎవరెవరు వెళ్లడం లేదో గుర్తించడమే కాక బాలలకు వివాహం జరిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. జిల్లా మహిళ సంక్షేమ శాఖ అధికారి విజేత తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కేజీబీవీని కమిషన్‌ సభ్యులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థినిలతో మాట్లాడి మెనూ అమలు, బోధన, సౌకర్యాలపై ఆరా తీశారు. సభ్యులు చందన, సరితతో పాటు అధికారులు పాల్గొన్నారు.

బాలల పరిరక్షణ కమిషన్‌ రాష్ట్ర చైర్‌పర్సన్‌ సీతా దయాకర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement