● ఏడాదిగా పేరుకుపోయిన బకాయిలు ● జిల్లాకు రూ.2.10 కోట్ల మేర పెండింగ్
ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లకు ఏడాది కాలంగా నిర్వహణ నిధులు నిలిచిపోయాయయి. రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో 215 వ్యవసాయ మార్కెట్లు కొనసాగుతుండగా ప్రతీ నెల లేదా రెండునెలలకోసారి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ నిర్వహణ నిధులు విడుదల చేసేది. కానీ గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు అంటే పది నెలలుగా నిధులు ఆగిపోయాయి. ఫలితంగా బకాయిలు దాదాపు రూ.200 కోట్లకు చేరాయి.
చిల్లిగవ్వ లేక...
వ్యవసాయ మార్కెట్ల పరిధిలో పంట ఉత్పత్తులు నిల్వ చేసే గోదాములకు ఏటా బీమా చెల్లింపులు చేయాలి. కానీ ప్రభుత్వం నుంచి నిధులు రాక బీమా చెల్లింపులే కాక మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు ఆస్తి పన్నుల చెల్లింపులు నిలిచిపోయాయి. అంతేకాక కరెంటు బిల్లు బకాయిలు పేరుకుపోవడంతో పలుచోట్ల మార్కెట్లు, చెక్ పోస్టులకు సరఫరా తొలగించారు. ఇక రెగ్యులేటెడ్ మార్కెట్లలో క్లీనింగ్ కాంట్రాక్టర్లకు పది నెలల బిల్లులు రాక ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇవికాక కార్యాలయాల్లో కంప్యూటర్లు, ప్రింటర్ల నిర్వహణతో పాటు చైర్మన్లకు వాహన ఖర్చులు, ఇతర చెల్లింపులూ జరగడం లేదు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మలక్‌పేట, బాట సింగారం, సిద్దిపేట, ఒంటిమామిడి వంటి పెద్ద మార్కెట్లకు రూ. కోట్లలో బకాయిలు ఉండగా, ఖమ్మం జిల్లాలోనే రూ.2.10 కోట్ల మేర నిధులు అందాల్సి ఉంది. వ్యవసాయ మార్కెట్లు పంట కొనుగోళ్ల నుంచి వసూలు చేసే ఫీజును మార్కెటింగ్ శాఖకు చెల్లిస్తున్నా మునుపెన్నడూ లేని విధంగా పది నెలల నిధులు నిలిచిపోవడం గమనార్హం. ఇప్పటికై నా నిర్వహణ నిధులు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీలు కోరుతున్నాయి.


