జిల్లావ్యాప్తంగా విధుల బహిష్కరణ
ఖమ్మంవ్యవసాయం: సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనే లక్ష్యంగా విద్యుత్ కార్మికులు బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఆర్టిజన్లకు ఏపీఎస్‌ఈబీ రూల్స్ వర్తింపచేయాలని, అన్‌మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని, పీస్‌రేట్ కార్మికులు, స్టోర్ హమాలీలకు కనీస వేతనం చెల్లించాలనే డిమాండ్లతో కొన్నాళ్ల నుంచి రాష్ట్రవ్యాప్తంగా డిస్కం, ట్రాన్స్‌కో విభాగాల కార్మికులు పోరాడుతున్నారు. ఈమేరకు జేఏసీగా ఏర్పడి చేపడుతున్న ఉద్యమంలో భాగంగా బుధవారం నుంచి ఉమ్మడి జిల్లాలో సమ్మెకు దిగారు. ఈమేరకు ఖమ్మం ఖానాపురంలోని ఉన్న ట్రాన్స్‌కో కార్యాలయం, మధిర, వైరా, సత్తుపల్లి డివిజన్లతో పాటు కొత్తగూడెం, భద్రాచలం విద్యుత్ డివిజన్ల ఎదుట నిరసన తెలిపారు. ఉమ్మడి జిల్లా జేఏసీ చైర్మన్ వల్లాల యుగంధర్, కన్వీనన్లు అన్వర్ పాషా, సురేందర్‌రెడ్డి, రామకృష్ణ, ఉపేందర్ నాయకత్వాన సమ్మె మొదలుకాగా, 1104, 327, సీఐటీయూ, 1532 తదితర సంఘాల ప్రతినిధులు తక్కెళ్లపల్లి శేషగిరిరావు, రవికుమార్, ఎం.ప్రసాద్, బానోత్ ఉపేందర్, మడక శ్రీను తదితరులు సంఘీభావం తెలిపారు. కాగా, కార్మికులంతా ఏకకాలంగా సమ్మెకు దిగడంతో పలు విద్యుత్ సెక్షన్లలో నిర్వహణకు ఇబ్బంది తలెత్తగా ఉన్న వారితోనే అధికారులు పనిచేయిస్తూ చక్కదిద్దారు.


